నారాయణఖేడ్, జూలై 16: హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు అక్రమంగా తరలిస్తున్న 550 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నారాయణఖేడ్ పోలీసులు పట్టుకున్నారు. నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి కథనం ప్రకారం.. నిజాంపేట్ శివారులోని 161 జాతీయ రహదారిపై మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపిన రెండు లారీలను సోదా చేశారు. లారీల్లో రేషన్ బియ్యం ఉన్నట్టు తేలడంతో స్థానిక పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ మహేశ్‌కుమార్ ద్వారా పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. లారీల్లో 55 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి వాటిని నారాయణఖేడ్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించామని చెప్పారు. లారీ డ్రైవర్లు జుబేర్, బాలాజీలను అరెస్టు చేసి యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
న్యాల్కల్, జూలై 16: మండలంలోని చాల్కి చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు, హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం చౌరస్తాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా టెంపోలో అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 15 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతోపాటు వాహనాన్ని స్వా ధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన బియ్యాన్ని దిగ్వాల్లోని సివిల్ సప్లయ్ గోదాంకు తరలించినట్లు ఎస్ఐ రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.