ప్రమాదాలు, సాధారణ మరణాలతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు ‘రైతుబీమా’ కొండంత అండగా నిలుస్తున్నది. 2018 లో ఈ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా ఎన్నో కుటుంబాలకు ఆసరా అయింది. 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సుండి, గుంట జాగ ఉన్న వారిని సైతం అర్హులుగా ప్రకటించడంతో పాటు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఆపత్కాలంలో బీమా డబ్బులు రూ. 5లక్షలు నామినీ అకౌంట్లలో జమచేస్తూ ఆర్థికంగా భరోసానిస్తున్నది. 2023-24 ఏడాదికి సంబంధించి గత నెల 11 నుంచి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. శనివారంతో ఆఖరు తేదీ కావడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పేర్లు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 34,222 మందికి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయగా, శుక్రవారం వరకు 19,570 అప్లికేషన్లు వచ్చాయి. మిగతా 6652 మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఐదేండ్లలో 6576 కుటుంబాలకు సర్కారు రూ.329 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. మెదక్ జిల్లాలో 10,320 మందిని అర్హులుగా గుర్తించారు.
మెదక్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రైతుబీమా పథకానికి శనివారంతో దరఖాస్తు గడువు ముగియనున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబీమా పథకంపై ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతు చనిపోయిన వెంటనే ప్రభుత్వం నుంచి రైతుబీమా పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నది. రూ.5 లక్షల బీమా పథకాన్ని రైతు నామినీ ఖాతాలో జమచేయనుంది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టింది. గుంట జాగ ఉన్న రైతుకు కూడా ఈ పథకంలో అవకాశం కల్పించడంతోపాటు బీమా సొమ్మును ప్రభుత్వమే భరిస్తోంది. ప్రమాదం, సాధారణ మరణంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన సమయంలో బీమా సొమ్ము ఆర్థికంగా ఆదుకుంటోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకంపై గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఇంటికి తిరిగి రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. రైతు చనిపోయిన వెంటనే బీమాకు సంబంధించిన అన్ని పత్రాలను వ్యవసాయ శాఖ పరిశీలించి రైతుబీమాను నామినీ అకౌంట్లో జమయ్యేలా చూస్తున్నారు.
18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు రైతులకు..
తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018 నుంచి రైతు బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తుంది. ఏదైనా కారణాల వల్ల రైతుకు మరణం సంభవించినచో రైతు కుటుంబంలో నామినీకి పదిరోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు పొందుతాడు. రైతుబీమా కార్యక్రమం కింద రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా రైతుల కుటుంబాలకు బీమా మొత్తం లభిస్తుంది. 2023 జూన్ 18 ముందు మంజూరైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారు అర్హులని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నామినీ నమోదు చేయడం కోసం రైతుబీమా దరఖాస్తు, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద సంతకం చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం నామినీని మార్పు చేసేందుకు అవకాశం కల్పించింది.
రైతుబీమాను సద్వినియోగం చేసుకోవాలి
రైతుబీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. శనివారంతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఈ ఏడాది కొత్తగా 10,320మంది రైతులకు రైతుబీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతు చనిపోతే నామినీ ఖాతాలో రూ.5 లక్షల బీమాసొమ్ము జమ చేస్తాం. రైతులు బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుంది.
– ఆశాకుమారి, మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ఈ ఏడాది కొత్తగా 10,320మంది రైతులకు..
మెదక్ జిల్లాలో ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు 10,320 మంది ఉండగా, జిల్లాలో పాస్ పుస్తకాలు కలిగిన రైతులు 1,41,029 ఉన్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. శనివారం వరకు దరఖాస్తులను వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులు స్వయంగా వెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాలసీ ఈనెల14 నుంచి అమల్లోకి రానుంది.
దరఖాస్తుకు నేడు తుదిగడువు
రైతుబీమాకు అర్హులైన రైతులు శనివారంలోగా దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు తెలిపారు. రైతుబీమాకు కోసం దరఖాస్తు ఫారం, పట్టదారు పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రులను రైతు వేదికలో ఉండే తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలి సూచించారు.