నిజాంపేట, మార్చి 4: రైతుల సంక్షేమానికి యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తున్నది. రైతులు సంప్రదాయ సాగును పక్కన పెట్టి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పండించే పంటలు నేడు తెలంగాణ రాష్ట్రం నిజాంపేట మండలంలో సాగవుతున్నాయి. డ్రాగన్ ప్రూట్ సాగు విధానం, పెట్టుబడి ఖర్చు, పంట ఆదాయం ఎంత వస్తుందనే అంశాలను ఓ యువ రైతు క్షుణ్ణంగా తెలుసుకుని పంట పండిస్తున్నాడు. నిజాంపేట మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన యువ రైతు నామసాని స్వామి ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్‌ను పండిస్తున్నాడు.
ఒక్కసారి నాటితే 20 ఏండ్ల వరకు..
డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒక్కసారి నాటితే 20 ఏండ్ల వరకు పంట పండుతుంది. నేల రకాన్ని బట్టి మొక్కకు నీరందించాలి. నీరు అధికంగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మొక్క చనిపోయే ఆస్కారం ఉంది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు డ్రాగన్ ఫ్రూట్ పంట చేతికొస్తుంది. ఎకరాకు రూ.4 లక్షల వరకు పెట్టుబడి కాగా, ఆదాయం రూ.7 నుంచి రూ.8 లక్షల వరకు వస్తుంది.
అన్ని రకాల నేలలు అనుకూలం..
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు మరింతగా అనుకూలం. ఈ పంటను తక్కువ నీటితో పండించవచ్చు. పూత, కాత సమయంలో 5 రోజులకు ఒకసారి తడి అందిస్తే చాలు. ఒక ఎకరంలో దాదాపుగా రెండు వేల మొక్కలు అవసరమవుతాయి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల ఎదుగుదల ముఖ్యం కావున సిమెంట్ స్థంభాలు ఏర్పాటు చేసి వాటి చుట్టూ ఇరువైపులా మొక్కలు నాటి కిందకి జారిపడకుండా స్తంభంపైన టైరును ఏర్పాటు చేయాలి.
ఈ ఫ్రూట్లో ఔషధ గుణాలు మెండు
డ్రాగన్ ఫ్రూట్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. జ్యూస్, జాం వివిధ రకాల పానియాల్లో ఈ ఫ్రూట్‌ను వినియోగిస్తారు. ముఖ్యంగా ఈ పండును తినడం వల్ల క్యాన్సర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు దరిచేరవు. హిమోగ్లోబిన్ వృద్ధితో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. విటమిన్-సి, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి.
వాణిజ్య పంటలు సాగు చేయాలి..
ఎప్పుడూ ఒకే రకం కాకుండా డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలి. అందులో వాణిజ్య పంటలు సాగు చేయడంతో ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వాణిజ్య పంట రకమైన డ్రాగన్ ఫ్రూట్ సాగుకు తక్కువ నీళ్లు అవసరం ఉండడంతో బిందు సేద్యం, డ్రిప్ వంటి పరికరాలను వినియోగించుకోవచ్చు. దాదాపుగా ఎకరాకు 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వాణిజ్య పంటలు సాగు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సబ్సిడీలో బిందు సేద్యం, డ్రిప్ పరికరాలు అందిస్తున్నది. పందిరి సాగు కూరగాయలు, చెరుకు, తదితర వాణిజ్య పంటలకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ
నా భూమిలోని ఎకరంలో డ్రాగన్ ప్రూట్ పంటను సాగు చేస్తున్నా. నీటి అవసరం, చీడ పీడల సంక్రమణ కూడా తక్కువే. దాదాపుగా 650 మొక్కలు నాటాను. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. అక్టోబర్‌లో కొద్ది పరిమాణంలో పంట చేతికొచ్చింది. డ్రాగన్ ఫ్రూట్‌ను ఒక కిలోకు రూ.250 వరకు విక్రయించాం. ఈ పంటలో అంతర పంటగా ఉల్లి, కాకర, బీర చెట్లు పెంచుతున్నా. ఒక్కసారి మొక్క నాటితే 20 ఏండ్ల వరకు బేఫికర్‌గా ఉండొచ్చు. మరికొంత భూమిలో సాగు చేస్తా.