సిద్దిపేట, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. రైతులకు సాగు నిమిత్తం పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధును అందిస్తున్నది. ఇప్పటి వరకు 11 విడతలుగా రైతుబంధు డబ్బులను రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. 11వ విడత రైతు బంధు పూర్తి చేశారు. దీంతో రైతులు ఖుషీఖుఫీగా ఉన్నారు. ఇటీవల ఆగస్టు15న ఒకే సారి రూ. 99 వేల వరకు రైతుల రుణమాఫీ చేసింది. రైతులు అడగకుండానే రైతులకు కావాల్సిన అన్ని పనులు సీఎం కేసీఆర్ చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రైతు విత్తు విత్తిన నుంచి పంట చేతికొచ్చి మార్కెట్‌కు తీసుకుపోయి రైతుల చేతికి వచ్చే వరకు ప్రభుత్వమే చూసుకుంటున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే ఎన్నో పథకాలను ప్రారంభించింది. రైతుబీమా పథకంతో రైతు కుటుంబాల్లో భరోసా నింపింది. సబ్సిడీపై యంత్రాలు, ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతాంగానికి మద్దతు ధరను కల్పించింది. షావుకార్ల వద్దకు వెళ్లే తిప్పలు తప్పడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సాగు సమయం వచ్చిందంటే చాలు పెట్టుబడి సాయం ఎట్లా అని దిగులు ఉండే ఇవ్వాళ ఆ రంది లేదు. గత ప్రభుత్వాలు ఇలా పెట్టుబడి సాయం ఇవ్వక పోవడంతో షావుకార్ల వద్ద, వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి రైతులు సాగు చేసేవారు. తీరా పంట చేతికి వచ్చే సరికి షావుకార్లు,వ్యాపారుల వడ్డీలకు పంట సరిపోయేది. దీంతో రైతులు అప్పుల పాలయ్యేవారు. ఇప్పుడు రైతులకు అలాంటి పరిస్థితులు లేవు.
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం రైతు బంధును అర్హులైన ప్రతి రైతు ఖాతాలో డబ్బులను జమ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11వ విడతలో సిద్దిపేట జిల్లాలో 3,20,921 మంది రైతులకు 313.96 కోట్లు , మెదక్ జిల్లాలో 2,60,104 మంది రైతులకు194.90 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,60,320 మంది రైతులకు 376.02 కోట్లు జమ చేసింది. రైతు బంధు ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు అనగా (మొదటి నుంచి 11వ విడత వరకు ) సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637 రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మంది రైతులకురూ.3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. రైతు బంధు వల్ల రైతులకు ఇబ్బందులు తప్పాయి. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలు అందించారు. గత శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందిస్తున్నారు.ఇప్పటి వరకు 11 విడతలుగా నిరంతరంగా రైతు బంధును అందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని అందించి రైతులకు సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. స్వయంగా రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నది.
రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కావడంతో రైతులు అడగకుండానే అన్ని చేసి పెడుతున్నారు. 2018 మేలో ప్రారంభించిన రైతు బంధును పంట సాగుకు ముందే రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఏడాదికి రెండు పంటలకు ఎకరాకు రూ. 10 వేలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 11విడతల్లో రైతు బంధును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశాం. మొత్తం ఉమ్మడి జిల్లాలో 85,99,091మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకుంటున్నది. రైతుబీమా పథకంతో రైతుల కుటుంబాల్లో భరోసా నింపింది. కర్షకులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.
– హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి
వర్గల్, ఆగస్టు 24: నాకున్న నాలుగు ఎకరాలకు తోడు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. రెండు ఎకరాల్లో వరి, ఏడు ఎకరాల్లో పత్తి సాగుచేశా. తెలంగాణ ప్రభుత్వం ఆరునెలలకు ఒకసారి రైతుబంధు డబ్బులు వేయడంతో లాగోడికి ఇబ్బంది లేకుండా పోయింది. గతంలో వానకాలం వచ్చిందంటే పెట్టుబడి కోసం శావుకారిని కలిసేటోన్ని. సీఎం కేసీఆర్ రైతుబంధు ఇస్తుండటంతో ఆ తిప్పలు తప్పాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువులు దొరక్క బ్లాకుల్లో కొనేటోళ్లం. యూరియా కోసమైతే షాపుల ముందు లైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూసినం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ బాధలు పోయాయి. ఎరువులు, విత్తనాలు, భూసార పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. రైతు బీమా, రైతు బంధు వస్తున్నది. ఉచిత కరెంట్, ధాన్యం కొంటున్నారు. రుణమాఫీ చేశారు. రైతులకు ఇంతకంటే ఏమికావాలి? రైతులు మురిసే రాజ్యం వచ్చింది.
– లచ్చగౌని రాములు, రైతు, నాచారం, వర్గల్ మండలం
గజ్వేల్, ఆగస్టు 24: రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ తపన. అందుకే ప్రతి ఏడాది ఎకరానికి రెండుసార్లు రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నాడు. అది లాగోడికి అక్కరొస్తున్నది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతుల బతుకులు మారాయి. దగ్గర్లోనే ప్రాజెక్టులు కట్టడంతో నీళ్ల సౌలత్ పెరిగింది. కాళేశ్వరం నీళ్లతోప్రాజెక్టులు నిండడంతో బోరు వేస్తే నీళ్లు బాగానే పడ్డాయి. వంకాయ, బెండకాయ, వరి పంటలు సాగుచేశా. పదిరోజుల కింద రూ.87 వేలు రుణమాఫీ అయ్యిందని మెసేజ్ వచ్చింది. చానా సంతోషమనిపించింది. కేసీఆర్ రైతుల కోసం ఎంతో చేశాడు. రైతులు తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటారు.
– మేకల స్వామి, యువరైతు, రిమ్మనగూడ, గజ్వేల్ మండలం
దుబ్బాక, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ రైతుల పాలి ట దేవుడు. నాకు మూడున్నర ఎకరాల భూమి ఉన్న ది. వానకాలం నాట్లు వేసే సమయంలోనే రూ.17, 500 రైతు బంధు పైసలు పడ్డాయి. తెలంగాణ రాకముందు అప్పు కోసం షావుకారు, ఫైనాన్స్ వాళ్ల దగ్గరకు కాళ్లు అరిగేలా తిరిగి గోస పడ్డాం. ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే పైస లు బ్యాంకులో జమ అవుతున్నాయి. నాకు రూ.90 వేలు రుణమాఫీ అయ్యింది. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు.
– ఇలిటం దేవేందర్‌రెడ్డి, రైతు, గ్రామం చేర్వాపూర్, దుబ్బాక మండలం