అక్కన్నపేట, నవంబర్ 15: మండలంలోని చౌటపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం 312 సర్వే నంబర్ బాధిత రైతులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని వివరాలు సేకరించారు. గొడవలు సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు వెళ్లిపోయిన అనంతరం రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇవ్వమని తీర్మానించుకున్నారు. సమిష్టిగా ఉంటూ శాంతియుతంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు విషయంపై స్థానిక కాంగ్రెస్ నాయకులతో మరోసారి చర్చించి, వారి ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఉండేలా ప్రయత్నాలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్కు వద్దే వద్దు… అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో నమస్తే కథనంపై మండలంలోని జనగామ, చౌటపల్లి, తోటపల్లి గ్రామాల్లోని రైతులు, గ్రామస్తులు చర్చించుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం చౌటపల్లి సర్వేనంబర్ 312తో ఆయా గ్రామాల్లోని పట్టా, ప్రభుత్వ భూముల సర్వేనంబర్ల ఇతరత్రా వివరాలను తెలపడంతో కథనం ఆసక్తికరంగా మారింది. నమస్తే కథనాన్ని ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు.