జోరువానలకు సంగారెడ్డి, మెదక్ జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. చెరువులు అలుగు పారుతుండగా, ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. మంజీరాలోకి భారీగా వరదనీరు వస్తుండడంతో ఘనపూర్ పొంగిపొర్లుతున్నది. ఎడతెరిపిలేని వర్షాలతో పలుప్రాంతాల్లో పంటలు నీటమునగగా, వాగులు ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని చోట్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోవడంతో కొంతమేర ఆస్తినష్టం సంభవించింది.
ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలపై ఆయా శాఖల సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. కంది కిసాన్‌సాగర్ చెరువును సంగారెడ్డి కలెక్టర్ శరత్‌కుమార్ పరిశీలించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా, ప్రత్యేక, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాకు రెండ్ అలర్ట్ ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. పట్టణ శివారులోని నాయక్ చెరువును కలెక్టర్ రాజర్షి షా పరిశీలించి కట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో 29.7 మి.మీటర్ల వర్షం కురవగా, మెదక్ జిల్లాలో 34.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
-సంగారెడ్డి/మెదక్ న్యూస్‌నెట్‌వర్క్, జూలై 27
సంగారెడ్డి, మెదక్ జిల్లాల వ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు రోడ్లపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కల్వర్టులు, బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవాహిస్తుండడంతో పలుచోట్ల రోడ్లను మూసివేశారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా స్థానిక యంత్రాంగం, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువుల వద్దకు వెళ్లి సెల్పీలు దిగవద్దని సూచించారు. గ్రామాల్లో పాత భవనాలు, కూలిపోయే స్థితిలో ఉన్న వాటిని గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
– మెదక్/సంగారెడ్డి, నూస్నెట్వర్క్, జూలై 27