సంగారెడ్డి, జూలై 29(నమస్తే తెలంగాణ): రెండో విడత పంట రుణమాఫీపై సంగారెడ్డి జిల్లా రైతుల్లో నిరాశను నింపింది. ఏకకాలం లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి మాటతప్పి విడతల వారీగా రుణమాఫీ చేస్తుండడంపై రైతు ల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మొదటి విడత రుణమాఫీపై ఆయోమయం నెలకొనగా, తాజాగా ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ ప్రకటించింది. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో రెండో విడత రుణమాఫీ అమలు చేయనున్నారు. రెండోవిడతలోనూ చాలా తక్కువ మంది రైతులకు రుణమాఫీ అవుతున్నట్లు తెలుస్తున్నది.
దీంతో పంటరుణమాఫీ అమలుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు పం టరుణం ఏకకాలంలో చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి విడతల వారీగా పంట రుణమాఫీ అమలు చేస్తున్నారు. ఈనెల 18న మొదటి విడత రుణమాఫీ అమలు చేశారు. లక్ష రూపాయల్లోపు తీసుకున్న పంటరుణాలు మాఫీ చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం జిల్లాలో ఎంత మంది రైతులు అర్హులు అనే వివరాలను ప్రకటించకుండా నేరుగా లబ్ధిదారుల జాబితా ప్రకటించింది. రుణమాఫీకి పీఎం కిసాన్ సమ్మాన్ నిబంధనలు, రేషన్‌కార్డు ముడిపెట్టడంతో సంగారెడ్డి జిల్లాలో తక్కువ మంది రైతులకు లక్ష రూపాయల్లోపు రుణమాఫీ అయ్యింది.
జిల్లాలో లక్ష రూపాయల్లోపు రుణం తీసుకున్న వారి రైతు ల సంఖ్య సుమారు 1.50 లక్షల మందికిపైగానే ఉంటారని అంచనా. అయితే ప్రభు త్వం మొదటి విడతలో లక్ష రూపాయల రుణం తీసుకున్న 48,970 మంది రైతులకు రూ.279.62 కోట్ల రుణమాఫీ చేసింది. చాలా మంది రైతులు లక్షరూపాయల్లోపు పంట రుణం తీసుకున్నా మాఫీ కాలేదని నిత్యం వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజా గా ప్రభుత్వం మంగళవారం రెండో విడత రుణమాఫీ చేయనున్నది. రూ.1.50 లక్షల రుణం తీసుకున్న రైతులకు రెండో విడతలో పంటరుణం మాఫీ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో 25,191 మంది రైతులకు రూ.268.35 కోట్ల రుణమాఫీ అవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 1.50 లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతుల సుమారు 50వేల మందికిపైగానే ఉం టారు. ప్రభుత్వం 25,191 మందికి మాత్ర మే రెండో విడత రుణమాఫీ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంతీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ముగ్గురు రైతులకు నమూనా చెక్కులను అందజేయనున్నారు.