మెదక్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలు, ఇప్పటివరకు 1,38,165 మందికి కంటి పరీక్షలు నిర్వహించాయి. ఇందులో పురుషులు 66,011 మంది, మహిళలు 72,154 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 16,509 మందికి కండ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో చందునాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి చక్కటి స్పంద న లభిస్తున్నదన్నారు. కంటివెలుగుతో చూపు పదిలంగా ఉంటుందన్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రీడింగ్ అద్దాలు అవసరం ఉన్న వారికి వెంటనే అందజేస్తున్నామని, దూరపు చూపు వారికి ఆర్డర్ ఇస్తున్నామని తెలిపారు. 24వ రోజు బుధవారం 6235 మందికి కంటి పరీక్షలు చేసి, 522 మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 587 మందికి ఆర్డర్ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లాలో 16979 మందికి బుధవారం కంటి పరీక్షలు చేశారు. జిల్లాలో 66 కంటి వెలుగు శిబిరాల్లో 16979 మందికి పరీక్షలు చేశారు. 1570 మందికి ఆపరేషన్లకు ప్రతిపాదించారు. 1265 మందికి కండ్లద్దాలు అందజేశారు. 1010 మందికి అద్దాలకు రెఫర్ చేశారు.