గజ్వేల్, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీతకార్మికుల జీవితాలు బాగుపడ్డాయి. ప్రభుత్వం కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈత, తాగి వనాలు పెంచడంతోపాటు పింఛన్లు సైతం అందజేస్తున్నది. దీంతో కార్మికులకు చేతినిండా పనిదొరుకుతున్నది. నేడు కాళేశ్వరం జలాలతో దశాబ్దాల కరువు పోయింది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల రైతన్నకు భూ తల్లి ధాన్యపు రాశులు ఇస్తే, ఈత, తాటి వనాల ద్వారా సమృద్ధిగా కల్లు లభిస్తున్నది. ఆనాడు రైతుల లాగే ఆత్మహత్యల పాలైన గీత కార్మికులు ఇప్పుడు ఆర్థిక భరోసా పొందుతున్నారు. కల్లుగీత వృత్తితో కార్మికులు ఉపాధి పొందుతుంటే, గీత కార్మికుడిగా పనిచేసి వయస్సుపై బడిన వారు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నారు.
పెరిగిన ఈతవనాలు, ఈతకల్లు, నీరా వినియోగం
గజ్వేల్ ప్రాంతంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వివిధ రకాల పంటలు అద్భుతంగా పండి రైతుల జీవితాలు మారిపోయాయి. వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ ఊపందుకున్నాయి. ఈతచెట్లు, తాటిచెట్ల నుంచి భారీగా కల్లు లభ్యమవుతున్నది. ఈతకల్లు ఆరోగ్యదాయినిగా పలువురు చెబుతుండడంతో రోజూ గజ్వేల్, అహ్మదీపూర్, పాములపర్తి, వర్గల్, తున్కిఖాల్సా, నాచారం, వేలూరు తదితర ప్రాంతాల్లోని ఈతవనాలకు జనం వస్తున్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు ఆయా మండలాల ప్రజలే కాకుండా హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగులు సైతం కార్లలో వస్తున్నారు. గతంలో సాధారణ లొట్టి కల్లు రూ.150 వరకు విక్రయించగా, ప్రస్తుతం రూ.300 వరకు విక్రయిస్తున్నారు. లీటర్ బాటిల్ కల్లుకు రూ.150 వరకు అమ్ముతున్నారు. గీత కార్మికులతో పరిచయం పెంచుకున్న వారు ఒకరోజు ముందే కల్లు కోసం ఫోన్ చేస్తున్నారు.
లబ్ధిపొందుతున్న గౌడన్నల కుటుంబాలు
గజ్వేల్ ఎక్సైజ్ పరిధిలో ఈత కల్లు, తాటి కల్లు సమృద్ధిగా లభిస్తుండడంతో గీత కార్మికులకు చేతినిండా పనిదొరుకుతున్నది. గజ్వేల్ ఎక్సైజ్ పరిధిలోని గజ్వేల్ మున్సిపాలిటీతో పాటు గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, మర్కూక్ మండలాల్లో మొత్తం 92,839 ఈత చెట్లు, 3180 తాటి చెట్ల నుంచి గీత కార్మికులు కల్లు సేకరిస్తున్నారు. గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 22 కల్లుగీత కార్మిక సొసైటీలు ఉండగా, 74 గ్రామాల్లో గీత కార్మిక దుకాణాల ద్వారా కల్లు విక్రయిస్తున్నారు. కల్లుగీత కార్మిక సొసైటీల పరిధిలో ఉన్న ఈత వనాలను ఏడాది లెక్కన సొసైటీ సభ్యులు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని సొసైటీ సభ్యులు పంచుకుంటున్నారు. దీంతో ఆయా సొసైటీలకు చెందిన గౌడకుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. వేలం పాటల్లో రూ. కోటి పైగా గజ్వేల్, రూ 40లక్షలకు పైగా పాములపర్తి సొసైటీలు పలుకుతున్నాయి. వేలంలో సొమ్ము చెల్లించే వారు ఏడాది ఆయా ప్రాంతాల్లో కల్లు విక్రయాలు చేయవచ్చు. అయితే చెట్ల నుంచి ఆయా ప్రాంతాల కల్లుగీత కార్మికులే కల్లు తీస్తారు. 882మంది గీత కార్మికులు కల్లుగీత వృత్తిద్వారా ఉపాధి పొందుతున్నారు. 2015 నుంచి హరితహారంలో భాగంగా ఏడాదికి 10వేల మొక్కలను ఎక్సైజ్‌శాఖ నాటుతున్నది. మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ ద్వారా సొసైటీలకు ప్రభుత్వం డబ్బులను సైతం చెల్లిస్తున్నది.
276 మందికి కల్లుగీత కార్మిక పింఛన్లు
కల్లుగీత కార్మిక వృత్తిలో వయస్సు పైబడిన గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నది. గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గజ్వేల్ మున్సిపాలిటీలో 12, గజ్వేల్ మండలంలో 77, మర్కూక్‌లో 60, ములుగులో 50, వర్గల్లో 35, జగదేవ్‌పూర్‌లో 42 మంది (50 ఏండ్లు నిండిన గీత కార్మికులు) రూ.2వేల పింఛన్ పొందుతున్నారు.
కల్తీకల్లుకు అడ్డుకట్ట
గజ్వేల్ సర్కిల్ పరిధిలో ఈతవనాల నుంచి సమృద్ధిగా కల్లు లభిస్తున్నది. గజ్వేల్‌లో కల్తీకల్లుకు అడ్డుకట్ట పడింది. సహజసిద్ధమైన కల్లు తాగి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కల్లు దుకాణాల్లో రోజూ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తారు. ఎక్కడా ఇప్పటి వరకు కల్తీకల్లు లభ్యమైనట్లు కేసులు నమోదు కాలేదు. నీర, తాటిబెల్లం తయారీలో గీత కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. కల్లుగీత గీసే సందర్భంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబానికి రూ.2లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వ్యక్తికి రూ.50వేలు, తాత్కాలిక అంగవైకల్యం పొందిన వ్యక్తికి రూ.10వేలు అందజేస్తున్నాం. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు బాగా పెరుగుతున్నాయి.
– బ్రహ్మానందరెడ్డి, ఎక్సైజ్ సీఐ గజ్వేల్
పట్నం నుంచి వస్తున్నారు
సెలవుల్లో చాలా మంది హైదరాబాద్ నుంచి పాములపర్తి ఈతవనానికి వస్తున్నారు. పట్టణాల్లో ఎక్కువగా మద్యం తాగే వాళ్లు మార్పు కోసం వీకెండ్స్‌లో రావడమే కాకుండా, స్థానికంగా కల్లు, నీరాకు మంచి డిమాండ్ పెరిగింది. చెట్లు కాంట్రాక్టు తీసుకోవడానికి పోటీ పెరిగింది.
– ప్రసాద్, ఈతవనం కాంట్రాక్టర్, పాములపర్తి
ఆరోగ్యం, చల్లదనం కోసం వస్తుంటారు
ఆరోగ్యం కోసం, యూరినల్ సమస్యలు ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో ఉదయం ఆరు గంటలకు కల్లు, నీరా తాగడానికి వస్తున్నారు. రోజు 80 నుంచి వంద చెట్ల వరకు గీస్తుంటాం. మిగిలిన కల్లును కల్లుడిపోకు తరలిస్తాం. గత ఐదేండ్ల నుంచి మంచి కల్లు లభిస్తున్నది. మాకు కూడా చేతినిండా పనిదొరుకుతున్నది.
– నర్సాగౌడ్, కల్లుగీత కార్మికుడు, గజ్వేల్
మద్యం కన్నా కల్లుతో ఆరోగ్యం
ఈత, తాటికల్లు మద్యం కన్నా ఆరోగ్యవంతం కాబట్టే తాగుతున్నాం. ఈ మధ్య కల్లు తాగేవారు ఈతవనాలకు చాలా మంది వస్తున్నారు. మా ఊరి వాళ్లకన్నా వేరే గ్రామాల నుంచి జనం ఎక్కువగా రావడం చూస్తున్నాం. ఆదివారం ఇక్కడ జాతరలాగే ఉంటుంది. అప్పటి రోజుల కన్నా ఇప్పుడు కల్లు బాగా లభిస్తుంది.
– అనిల్, స్థానికుడు, పాములపర్తి