గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 22, 2020 , 00:14:04

ఎకోదంతుడికి జై..

ఎకోదంతుడికి జై..

హుస్నాబాద్‌ టౌన్‌/ సిద్దిపేట టౌన్‌/ చేర్యాల/ మెదక్‌/ మెదక్‌ రూరల్‌/ గజ్వేల్‌అర్బన్‌/ అందోల్‌/ మునిపల్లి: ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో ఉత్సాహంగా జరుపుకొనే పండుగ వినాయక చవితి. ఆది దేవుడి నవరాత్రి ఉత్సవాలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే నిర్వాహకులు మండపాలను ఏర్పాటు చేసుకునే వారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగానే జరుపుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా గ్రామానికో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కరోనా నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తున్నది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఒకే విగ్రహం ఏర్పాటు చేసేందుకు తీర్మానాలు కూడా జరిగాయి. ప్రజల్లో కరోనాపై అవగాహన పెరుగుతుండడంతో నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు...

ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధాన్ని కొనసాగిస్తున్న ప్రజలను చైతన్య పరిచేందుకు పలు ప్రైవేట్‌ సంస్థలు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఇండ్లలో ఏర్పాటు చేసుకుని పూజించేందుకు వీలు విగ్రహాలను తయారు చేయించి, వారు చవితి పండుగ రోజు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేటలో ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో సిద్దిపేట జిల్లా కుమ్మరి వృత్తి విభాగం అధ్యక్షుడు కట్కూరి రవీందర్‌ మట్టి గణపతుల తయారీలో శిక్షణ పొంది స్వయంగా మట్టి గణపతులు తయారు చేసి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. 

గ్రామానికి ఒకే విగ్రహం...

రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతున్నది. దీంతో నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగానే నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే నిర్వాహకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అధికారులు సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రామానికి ఒకే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలని  కోరారు. ఇందుకు అనుకూలంగానే స్పందించిన వారు తమ గ్రామాల్లో ఒకే విగ్రహ ఏర్పాటుకు తీర్మానాలు కూడా చేసుకున్నారు. గ్రామంలో అందరూ ఒకే దగ్గర నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోనున్నారు. కాగా, ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై పోలీసు శాఖ కఠినంగానే వ్యవహరిస్తున్నది. ఇప్పటికే నిబంధనలు పాటించకుండా మండపాలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

మట్టి గణపయ్యకే జై...

కరోనా నేపథ్యంలో మండపాల కన్నా, ఇంట్లో పూజలు చేసుకునేందుకు ఈసారి జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్నారనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చిన్నచిన్న మట్టి విగ్రహాలను పూజించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందుకు వీలుగా పలుచోట్ల విగ్రహాల తయారీ దారులు కూడా చిన్నచిన్న మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. 

తయారీ కేంద్రాల్లోనే గణనాథులు...

వినాయక చవితి అంటే చిన్నాపెద్ద తారతమ్యం లేకుడా సంబురంగా నిర్వహించుకునే పండుగ. నవరాత్రులు వీధివీధినా సందడి చేసే గణపయ్య ఉత్సవాలపై కూడా కరోనా ప్రభావం చూపుతుందనే చెప్పుకోవచ్చు. ఓ వైపు తయారీదారులు సిద్ధం చేసిన విగ్రహాలు అమ్ముడు పోక కేంద్రాల్లోనే వెలవెల బోతున్నాయి. దీంతో తయారీదారులు కూడా కొనుగోలు దారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులను ఏర్పాటు చేసుకుని విగ్రహాలను తయారు చేస్తే వారికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని తయారీదారులు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. ఏదిఏమైనా కరోనాతో గణపతి విగ్రహాల తయారీ దారులకు ఈయేడు భారీ నష్టమే వాటిల్లిందని చెప్పవచ్చు.


logo