శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jul 14, 2020 , 03:39:20

డంపింగ్‌ యార్డు నిర్మాణాలు పూర్తి

డంపింగ్‌ యార్డు నిర్మాణాలు పూర్తి

  • l 250 గ్రామ పంచాయతీల్లోని డంపుయార్డుల్లో కంపోస్టు ఎరువుల తయారీ

మెదక్‌: పల్లెలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరుచేసి ఎరువుల తయారీకి ఉపయోగించేందుకు డంపింగ్‌యార్డుల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను సుందరం గా మార్చేందుకు అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రతి గ్రామ పంచాయతీకి నిధు లు కేటాయిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తున్నది. మెదక్‌ జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక్కో గ్రామ పంచాయతీకి గానూ రూ.2.50 లక్షల చొప్పున నిధులు కేటాయించి, ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు నిర్మించేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆయా నిర్మాణ పనులు పూర్తికాగా, చిన్నచిన్నవి పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

డంపింగ్‌ యార్డుల్లో ఎరువుల తయారీ

సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగానే డంపింగ్‌ యార్డుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా గ్రామాల్లో తడి, పొడి చెత్తను తీసుకువెళ్లేందుకు గానూ ప్రతి గ్రామ పంచాయతీకి ఆటో రిక్షా, ట్రాలీ ఆటోలను కేటాయించారు. పంచాయతీ కార్మికులు ఈ వాహనాల ద్వారా చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ మరోసారి తడి, పొడి చెత్తను వేరు చేసి వాటి ద్వారా కంపోస్ట్‌ ఎరువులు తయారు చేస్తున్నారు. ఆయా డంపింగ్‌ యార్డుల్లో ఎర్రలను (వానపాములు) పెంచుతున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు వానపాములను పంపిణీ చేయనున్నారు. డంపింగ్‌ యార్డుల ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి.

అందరి కృషితోనే గ్రామాల్లో పూర్తయిన డంపింగ్‌ యార్డులు..

జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. జిల్లాలో డంపింగ్‌ యార్డుల నిర్మాణంలో అధికారుల కృషి అమోఘం. తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా కంపోస్ట్‌ ఎరువులు కూడా తయారవుతాయి.

- ధర్మారెడ్డి, మెదక్‌ కలెక్టర్‌logo