గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 15, 2020 , 02:59:31

ప్రలోభాలకు లొంగొద్దు

ప్రలోభాలకు లొంగొద్దు

రామాయంపేట : ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి ఓటర్లకు సూచించారు. మంగళవారం రామాయంపేటలో నామినేషన్ల కేంద్రాలు, పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అబ్జర్వర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. బహుమతులకు, డబ్బులకు ఆశపడితే ఐదు సంవత్సరాలు బాధపడాల్సి ఉంటుందన్నారు. ఓటు వజ్రాయుధం వంటిదని, వృథా చేయవద్దన్నారు. అభ్యర్థులు నిబంధనలను మీరితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. రామాయంపేటలోని 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 150 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు వివరించారు. రామాయంపేటలో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు, ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటాయన్నారు. దొంగ ఓట్లు వేస్తే కేసులు నమోదవుతాయన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డును కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ వెంట రామాయంపేట మున్సిపల్ కమిషనర్ రమేశ్, అబ్జర్వర్లు రమేశ్ నాగరాజుగౌడ్, టౌన్ అధికారి ప్రభావతి, నవాత్ ప్రసాద్, కాలేరు ప్రసాద్, బల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


logo