సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. మల్లన్నస్వామి మమ్మేలు అంటూ భక్తులు చేసిన నామస్మరణతో శైవక్షేత్రం మార్మోగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 20వేల మందికి పైగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగుచెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. బోనాలు తీశారు.
చేర్యాల, డిసెంబర్ 31: కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. ఆదివారం ఈ పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. 20వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీశర్మ తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చ న, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ అమ్మారిని దర్శించుకోవడంతో పాటు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమాలలో మల్లన్న ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు పాల్గొన్నారు.