గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ‘గొర్రెల పంపిణీ’ పథకం అద్భుతం సృష్టిస్తున్నది. గొల్లకురుమల జీవితాల్లో ఆర్థిక పరిపుష్టిని నింపుతున్నది. సబ్బండ వర్గాలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, దళిత, బీసీ. మైనార్టీ బంధు లాంటి పథకాలను అమలు చేస్తుండడంతో ఆయా వర్గాల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపింది. అనతికాలంలోనే గొర్రెల సంపద ఆమాంతం పెరిగి గొల్లకురుమలను సీమంతులను చేసింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి విడుతలో సుమారు రూ.300 కోట్లు వెచ్చించి 32,200యూనిట్లను లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రెండో విడుతలో ఇప్పటి వరకు 1488 యూనిట్లను అందజేసింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ఏ గ్రామంలో చూసినా సర్కారు పంపిణీ చేసిన గొర్రెల మందలే కనిపిస్తున్నాయి. దీంతో గొల్లకురుమలు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
– మెదక్/సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
సిద్దిపేట, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులను మరింతగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో 2017 జూన్ 20న ప్రారంభించారు. ఆరోజు నుంచి దశల వారీగా గొల్లకుర్మలకు గొర్రెలు అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని గొల్లకురుమలకు సబ్సిడీపై తొలి విడుత పంపిణీ పూర్తి చేశారు. రెండో విడుత పంపిణీ ప్రారంభించి అర్హులైన వారికి అందజేస్తున్నారు. జిల్లాలో 412 సొసైటీలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో తొలివిడుతగా 15,720 యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడుతలో జిల్లాలో 17,913 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. నేటి వరకు జిల్లాలో 6,418 యూనిట్లకు లబ్ధిదారులువర్చ్యువల్ పద్ధతిన తమ 25 శాతం వాటా చెల్లించారు. రెండో విడుతలో జిల్లాలో ఇప్పటి వరకు 674 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సారి యూనిట్ ధరను ప్రభుత్వం పెంచింది. ఒక్కో యూనిట్‌కు రూ.1,75,000 చేసింది. ఇందులో లబ్ధిదారుడి వాటాగా రూ. 43,750 చెల్లించాల్సి ఉంటుంది. మిగతాది ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. లబ్ధిదారులకు త్వరితగతిన అందించేలా ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగుసూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొల్లకురుమలకు గొర్రెల పంపిణీని చేపట్టింది. గొల్లకురుమ సభ్యులంతా సొసైటీలుగా ఏర్పాటయ్యారు. గొల్ల కురుమ కుటుంబాల్లో 18 ఏండ్లు నిండి అర్హులైన ప్రతి గొల్లకురుమలకు గొర్రెలను దశల వారీగా అందించి వారికి ఉపాధి కల్పించింది. ప్రతి సభ్యుడికి (ఒక యూనిట్) 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తున్నారు. తొలి విడుతలో ఒక్కో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా ఇందులో లబ్ధిదారుడు రూ.31,250 తన వాటాగా చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ధరను పెంచింది. రెండో విడుతలో గతంలో ఉన్న యూనిట్ ధరకు అదనంగా రూ.50 వేలు పెంచి అందిస్తున్నది. ప్రస్తుతం యూనిట్ ధర రూ. 1,75,000 కాగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1,31,250 ఉంది. లబ్ధిదారుడి వాటా రూ. 43,750 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క యూనిట్ ధర రూ. 1,75,000 కాగా, ఇందులో నుంచి గొర్రెలను కొనుగోలు చేయడానికి రూ. 1,58,000, రవాణా కింద రూ.6500, ఒక ఏడాది బీమా కోసం రూ.5,000, ఫీడ్ కోసం రూ. 3500, మందుల కోసం రూ.500, ఇతర ఖర్చుల కోసం రూ.1500 చెల్లిస్తారు.
దీంతో గ్రామాల్లో రెండో విడుత అర్హులైన వారి నుంచి డీడీలు కట్టిస్తున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి గొర్రెలను తీసుకువచ్చి అందిస్తున్నారు. తొలి విడుతలో పంపిణీ చేయబడిన గొర్రెల్లో వివిధ కారణాల వల్ల 2,981 చనిపోయాయి. వీటిలో 2,503 గొర్రెలకు ఇన్సురెన్స్ పరిహారం అందించి తిరిగి 2,470 గొర్రెలను లబ్ధిదారులకు అందించారు. అత్యవసర చికిత్సల నిమిత్తం ప్రజలకు ఏ విధంగా 108 వాహనం ఉపయోగపడుతుందో అదే తరహాలో గొర్రెలకు 1962 పశువైద్య వాహనాన్ని నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో నాలుగు వాహనాలను ఏర్పాటు చేశారు. గొర్లమంద ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి టీకాలతో పాటు నట్టల నివారణ మందులు కూడా వేస్తున్నారు. జీవాలకు బీమానే కాకుండా గొర్రెల కాపరులకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా కల్పించింది. గొర్రెల యునిట్లకు దాణా ఉచితంగా ఒక్కో యూనిట్‌కు 206.4 కిలోల చొప్పున ప్రతి లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది. గొర్రెల్లో నట్టల నివారణ నిర్మూలనకు ఏడాదికి మూడు సార్లు ఉచితంగా నట్టల నివారణ మందు వేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకనాడు ఒక గొర్రె పొట్టేలు కావాలన్నా..? లోన్లు కావాలన్నా..? వివిధ కార్యాలయాలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. నేడు అలాంటి పరిస్థితి లేదు గ్రామసభల వద్దే నేరుగా అధికారుల సమక్షంలో ఎంపిక చేస్తున్నారు. గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి గొర్రెల యూనిట్లు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గొర్రెల పంపిణీ పారదర్శకంగా జరుగుతున్నది. వీటి మీద ఆధారపడి బతుకుతున్నవాళ్ల జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. ఒకనాడు అడవిలో అడుగుపెట్టనివ్వని అటవీ అధికారులతోనే నేడు సె్టైల్లో హేమట్టా గడ్డి పెంచడం, సంవత్సరానికి మూడుసార్లు నట్టల నివారణకు మందులు ఇవ్వడం, ప్రతి సీజన్లో వచ్చే వ్యాధులకు ముందుగానే మందులు సరఫరా చేయడం దేశంలోనే రాష్ట్రంలోనే ఆదర్శం.
సిద్దిపేటలో అనేక గ్రామాల్లో షెడ్లు నిర్మాణం చేయడం ప్రధానంగా వృత్తి మీద ఆధారపడే వాళ్ల ఆర్థిక విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అన్నింటికీ మించి ఎవరికీ చేయి చాపకుండా ఆత్మగౌరవంతో ఆర్థికంగా నిలవడానికి ఈ సీమ్ ఎంతో దోహదపడింది ప్రస్తుతానికి నగదు బదిలీ కోసం రైతుల ఎదురుచూస్తున్న మాట నిజం కానీ మాంసం దిగుమతి చేసుకునే రాష్ట్రం నుంచి మనం ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలంటే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు రావాల్సిందే. సిద్దిపేట జిల్లా వారికి కచ్చితంగా 21 గొర్రెలు వచ్చేలా ఎట్టి పరిస్థితుల్లో రీసైకిల్ జరగకుండా మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పశు సంవర్ధక అధికారి జగత్‌కుమార్‌రెడ్డి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. నిశిత పరిశీలన వల్ల జిల్లాలోని పశువైద్యాధికారులు, జిల్లా అధికారులు అందరినీ సమన్వయం చేస్తున్నారు. పారదర్శకంగా అమలు చేస్తున్న అధికార యంత్రాగానికి గొల్ల కురుమలు, గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం పక్షాన ధన్యవాదాలు.
– పోచబోయిన శ్రీహరియాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్
గొల్లకురుమలకు సర్కారు అండగా ఉంటున్నది. సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు గొర్లకురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఉపాధి లభిస్తున్నది. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా మా సంఘం తరపున నాకు ఒక యూనిట్ గొర్రెలు వచ్చాయి. ఇందులో 20 గొర్రెలు, ఒక పొట్టేలు రావడం చాలా సంతోషంగా ఉన్నది. సంఘంలోని సభ్యులందరికీ మంత్రి హరీశ్‌రావు ఊరు బయట విద్యుత్ మీటర్ పెట్టించి గొర్రెల దొడ్డిని నిర్మించారు. గొర్రెలు, పశువులు వ్యాధిన పడితే ప్రభుత్వం ఉచితంగా అంబులెన్స్ పెట్టి ఎక్కడ గొర్లు ఉంటే అక్కడికి వచ్చి మందులు ఇస్తున్నారు. ఇంత మంచి సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్సారు కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకుంటాం.
– ఎల్కపల్లి మల్లయ్య, ఇబ్రహీంపూర్,నారాయణరావుపేట మండలం
చేర్యాల, సెప్టెంబర్ 9 : సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన గొర్రె పిల్లల వల్ల మేలు జరిగింది. గొర్రెలను సాదుకుంటే బాగుంటది. ఆరు నెలలకు ఒక ఈతతో సంవత్సరానికి 40 గొర్రెలు సంతానం వస్తున్నది. ఆడ గొర్రెలు అమ్మకుండా పొట్టేలు మాత్రమే విక్రయిస్తున్నాం. 8, 9, 10కిలోల గొర్రెలకు రూ.6వేల నుంచి రూ. 8వేల వరకు ధర వస్తున్నది. గొర్రెలు సాదుకుంటే వచ్చిన ఆదాయంతో ఎకరం భూమి కొని ఇద్దరు పిల్లలను సైతం చేర్యాల ప్రైవేట్ పాఠశాలలో చదివిపిస్తున్నా.
-అమరగొండ మల్లయ్య, ఆకునూరు గ్రామం, చేర్యాల మండలం
మిరుదొడ్డి, సెప్టెంబర్ 9: నాయకుడంటే సీఎం కేసీఆర్ సారు లెక్క ఉండాలే. గొర్రె పిల్లలను అందజేసి ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. నాలుగేండ్ల కిందట మొదటిసారి రూ. 31,500 వేలు కట్టగానే రూ.లక్షా20 వేలతో 20గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు పిల్ల ఇచ్చిండ్రు. ఇప్పుడు మందలో 50 గొర్రె పిల్లలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోచాలా మాటలు జెప్పిండ్రు కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. మాటలు చెప్పడం కాదు చేసి చూపించే నాయకుడు సీఎం కేసీఆర్. గొల్లకురుమలు కేసీఆర్ సారుకు రుణపడి ఉంటారు. ఆర్థికంగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– మల్లేశం, మల్లికార్జున స్వామి సంఘం, మిరుదొడ్డి మండల అధ్యక్షుడు
గజ్వేల్, సెప్టెంబర్ 9: నాలుగేండ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్లు ఇచ్చారు అప్పుడిచ్చిన గొర్లు ఇప్పుడు నాలుగింతలయ్యాయి. మా గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ బాగుండాలే. ప్రభుత్వం ఇచ్చిన గొర్లను అందరూ సాదుకుంటుర్రు. ఇప్పటి వరకు రూ.2.50లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరో 35 వరకు గొర్లు ఉన్నాయి. కేసీఆర్ మాకు గొర్లు ఇచ్చేందుకు ముందుకొస్తే సంతోషమనిపించింది. కేసీఆర్ సారు వల్ల అందరికీ మంచి జరుగుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలకు మేలైంది. పైరవీలకు సంబంధం లేకుండానే గొర్లు వచ్చాయి.
– మానుక స్వామి, శ్రీగిరిపల్లి, గజ్వేల్ మండలం
హుస్నాబాద్, సెప్టెంబర్ 9: సీఎం కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు తీసుకోవడం ఆనందంగా ఉన్నది. మొదటి విడుతలోనే వస్తాయనుకున్నా కానీ రాలె. ఇప్పుడు గొర్రెలు అందాయి. ఇతర జిల్లాల నుంచి జీవాలను తెచ్చాం కాబట్టి ఇక్కడి వాతావరణానికి కొన్ని జీవాలు తట్టుకోలేక పోతున్నాయి. మందులు వాడుతూ కాపాడుకుంటున్నాం. మాకు గొర్రెలు ఇచ్చి మరింత ఆదాయాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్,ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– వెంకటయ్య, పొట్లపల్లి, హుస్నాబాద్ మండలం
హుస్నాబాద్, సెప్టెంబర్ 9: సర్కారు సాయాన్ని మరువలేం.మొదటి విడుతలో గొర్రెలు రాలేదు. రెండో విడుతలో వచ్చాయి. జీవాలను పెంచుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.ప్రభుత్వం చేసిన సాయానికి రుణపడి ఉంటాం.కుటుంబం మొత్తం గొర్రెల పెంపకంపైనే ఆధారపడి ఉన్నాం. సీఎం కేసీఆర్ సారుకు దండాలు.
– సిలివేరు మల్లేశం, గొర్ల కాపరి, పొట్లపల్లి, హుస్నాబాద్ మండలం
వర్గల్,సెప్టెంబర్ 9: సీఎం కేసీఆర్‌ను ఎన్నడూ మరువం. మా తాతల నుంచి గొర్రెలు కాసుడే బతుకుదెరువు అయ్యింది. చిన్నతనంలో దొడ్డినిండా గొర్లు ఉంటే పెద్ద శ్రీమంతుడితో జతకట్టేవాళ్లు. గొర్రెలు కాసుకుంటూ జీవనం కొనసాగించేవాళ్లకు ఏ ముఖ్యమంత్రి వొచ్చినా? ఏ సర్కారొచ్చినా ఇంతవరకు ఏపని చేయ్యలేదు?. గొల్లకురుమల గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే. గ్రామంలో మొత్తం 22 మంది కాపరులుంటే మొదటి విడతలో 11 మందికి గొర్లువొస్తే తలాఇన్ని పంచుకున్నాం. ఇప్పుడు రెండో విడతవొస్తె మళ్లీ పంచుకోవాలే. సర్కారు ఇచ్చిన గొర్రెలు మంచిగానే ఉన్నాయి. గొల్లకురుమల గురించి ఆలోచన జేసిన సీఎ కేసీఆర్ సారును ఎందుకుమరుస్తం. బతికినన్ని రోజులు గుర్తుంచుకుంటాం.
– శంకర్, శేరిపల్లి గ్రామం, వర్గల్ మండలం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొర్ల మందను ఇచ్చింది. నెల క్రితం ప్రకాశం జిల్లాకెళ్లి 21 గొర్రెల మందను తీసుకొచ్చాం. నాకు చాలా సంతోషంగా ఉంది. గొర్రెలు కూడా చాలా బాగున్నాయి. మా గ్రామంలో 71 మందికి గొర్రెల యూనిట్లను ప్రభుత్వం ఇచ్చింది. అందరూ కూడా గొర్రెలను మేపుతూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు సబ్సిడీ గొర్రెలతో సంపద పెరిగింది. మెదక్‌లో ప్రతి మంగళవారం గొర్రెల సంత పెట్టిండ్రు. ఇక్కడే అమ్ముకుంటున్నం. ఒకప్పుడు వివిధ శుభకార్యాల కోసం గొర్రెలు, మేకలు కావాలంటే పక జిల్లాలోని సంతలకెళ్లి కొనుకుని వచ్చేవాళ్లు. సరారు చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాలతో గొర్రెల ఉత్పత్తి బాగా పెరిగింది. ఆరేండ్లలో గొర్రెల సంపద మూడు రేట్లు పెరిగింది. ఏ గ్రామంలో చూసినా సరారు పంపిణీ చేసిన గొర్రెల మందలే కనిపిస్తున్నాయి. నాడు గొర్రెలు, మేకలు 20కన్నా ఎకువుండేవి కావు. ఇయ్యాల వందకు పైగున్నయ్. కాసేందుకు ముగ్గురం కలిసి గుట్టకు పోతున్నం. ఊళ్లల్లో మాంసం దుకాణాలు రెండు మూడైనయ్. ఒకరి దగ్గర పనిచేసే మేము సరారు దయ వల్ల మంచిగున్నం. ఇదంతా కేసీఆర్ సార్ పుణ్యమే, ఆయన చల్లగుండాలి. మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి.
– బండారి యాదగిరి, లబ్ధిదారుడు, శాలిపేట, చిన్నశంకరంపేట మండలం
పోయిన ఏడాది సబ్సిడీ గొర్రెల కోసం డీడీలు కట్టినం. పదిహేను రోజుల కిందట గొర్రెలు అచ్చినయి. తెలంగాణ సర్కార్ 75శాతం సబ్సిడీపైన నాకు 21 గొర్లను ఇచ్చింది. నేను కేవలం రూ.43వేలు మాత్రమే కట్టిన. ప్రభుత్వం గొర్లను ఇవ్వకుముందు నాకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తుండేదాన్ని. గొర్రెల మంద వచ్చిన తర్వాత గొర్రెలను మేపడానికి వాటితో వెళ్తున్నా.. గొర్లతో కుటుంబ అవసరాలు ఎకువగా తీరాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన గొర్లు మాత్రం నాకు జీవనోపాధి కల్పించాయి. అదే ధైర్యంతో ముందుకుపోతున్నా. ఆయన పుణ్యమా అని మా కుటుంబం ఎంతో బాగు పడింది. జీవితాంతం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– బండారి గంగమ్మ, లబ్ధిదారురాలు, శాలిపేట చిన్నశంకరంపేట మండలం