సంగారెడ్డి, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానకు పోవాలంటే రోగులు భయపడే పరిస్థితి… నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ రోగులు ప్రైవేటు దవాఖానల బాటపట్టేవారు. పేదలు సైతం అప్పులు చేసి మరీ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు ఉండేవి. ఉమ్మడి పాలనలో సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో అరకొర వైద్య సౌకర్యాలు ఉండేవి. వైద్య సిబ్బంది లేమికి తోడు మందుల కొరత అత్యధికంగా ఉండేది. మాతాశిశు మరణాల సంఖ్య కూడా గణనీయంగా ఉండేది. అలాంటిది స్వరాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా సారథ్యం, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లాలో వైద్యవిప్లవం చోటు చేసుకుంది. ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానలను దీటుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారు. సాధారణ ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంది. మాతాశిశు మరణాల రేటు సంగారెడ్డి జిల్లాలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. మహిళల్లో రక్తహీనత సమస్య, పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య తీరిపోయింది. ప్రభుత్వం కోట్లాది నిధులతో ప్రభుత్వ దవాఖానలను పటిష్టం చేసి పేదలకు కార్పొరేట్ తరహా వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొవిడ్ సమయంలో కూడా ప్రభుత్వం రోగులకు అండగా నిలిచి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. సీఎం కేసీఆర్ పాలనలో వైద్యరంగం మెరుగుపడడంతో అన్ని వర్గాల వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సీఎం కేసీఆర్‌తో తీరిన మెడికల్ కాలేజీ కల
ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంగారెడ్డి ప్రజల కల. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడగానే సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతోపాటు నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేశారు. గతేడాది నవంబర్‌లో సీఎం కేసీఆర్ సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభించారు. రూ.30 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మించారు. నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం ఇటీవలే మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.