సిద్దిపేట, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సమాయత్తం అయ్యింది. పురిటిగడ్డ నుంచి యువత పాదయాత్రగా కేసీఆర్ సభకు బయలుదేరుతున్నారు. వినూత్న తరహాలో పాదయాత్ర చేపడుతున్నారు. జబ్బకు సంచి ..చేతిలో గులాబీజెండా…గులాబీ టీషర్టు వేసుకొని గులాబీ సైనికులు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1500 మంది శుక్రవారం ఉదయం 6గంటలకు రంగాధాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి బయలుదేరుతారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు గులాబీ జెండాను ఊపి ప్రారంభించనున్నారు. దీనికోసం అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు పాల్గొననున్నారు.
యువత పాదయాత్ర మూడు రోజలు పాటు కొనసాగనున్నది. ఈ పాదయాత్ర కోసం హరీశ్‌రావు ప్రత్యేక ఒక కమిటీని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట నుంచి రజతోత్సవ సభ 64 కిలోమీటర్లు కొనసాగుతుంది. హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి రజతోత్సవ సభకు వరకు పాదయాత్ర చేరుకుంటుంది.యువత పాదయాత్రలో ప్రత్యేక ఆకర్శణగా ఉండనున్నది. ప్రత్యేకంగా ఒక ప్రచార రథాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట- హన్మకొండ రహదారి మీదుగా కొనసాగనున్న పాదయాత్రలో భాగంగా ఆయా గ్రామాల వద్ద యువత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను యువత గ్రామాల్లోని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పాలన, తెలంగాణలో వ్యవసాయం పండుగలా చేసుకున్న వైనం, సాగు, తాగునీరు తదితర అంశాలపై ప్రజలకు వివరించనున్నారు. ప్రత్యేకంగా కళా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకోసం రెండు బృందాలను పాదయాత్రలో ఏర్పాటు చేశారు.
పాదయాత్రకు ప్రత్యేక కమిటీని హరీశ్‌రావు నియమించారు. పూజల వెంకటేశ్వర్లు(చిన్న) సమన్వయకర్తగా నియమించిన కమిటీలో సీనియర్ నాయకులు కోల రమేశ్ గౌడ్, శ్రీహరి యాదవ్, ప్రభాకర్ వర్మ, భూమయ్యగారి కిషన్ రెడ్డి, మెర్గు మహేశ్ ఉన్నారు. వీరు యువత పాదయాత్ర సందర్భంగా వారి వెంట ఉంటారు. రాత్రి బస కల్పించడం, తాగునీటి వసతి తదితర అంశాలను వీరు చూసుకుంటారు. ఇప్పటికే ఈ కమిటీ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఏ రోజు ఎక్కడ వరకు పాదయాత్ర చేయాలి. ఎక్కడి రాత్రి బసచేయాలి అనే దానిపై ప్రణాళిక సిద్ధం చేశారు.
సిద్దిపేట రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద 25న యువత పాదయాత్రను హరీశ్‌రావు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాదయాత్ర పాలమాకుల, బద్దిపడగ, బస్వాపూర్, సముద్రాల, పందిల్ల, హుస్నాబాద్, ముల్కనూరు మీదుగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 27న సాయంత్రం జరిగే రజతోత్సవ సభకు వద్దకు చేరుకుంటుంది. ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 30 మంది యువత పాదయాత్రలో భాగమవుతున్నారు. ఇప్పటికే చాలామంది యువత మేము సైతం అంటూ పాదయాత్రలో పాల్గొనడానికి కమిటీకి తమ పేర్లు ఇచ్చి నమోదు చేయించున్నారు.
పాదయాత్రగా వెళ్లేవారికి పత్యేక టీషర్టులు, టోపీలు, గులాబీ జెండాలు అందిస్తారు. వారి వెంట కళాజాత ఉండనున్నది. మూడు రోజుల పాటు 64 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతారు. 25న సిద్దిపేట రంగధాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి ఉదయం 6గంటలకు బయలుదేరుతారు. ఆరోజు మధ్యా హ్నం వరకు పాలమాలకు ఎల్లమ్మగుడి వద్దకు చేరుకుంటారు.
అక్కడ మధ్యాహ్న భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం బయలుదేరి బద్దిపడగ ఎల్వీఆర్ ఫంక్షన్‌హాల్‌కు రాత్రి 8 గంటల వరకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.26న ఉదయం బయలుదేరి సముద్రాలకు మధ్యాహ్నం వరకు చేరుకుంటారు. అక్కడ స్థానిక ఫంక్షన్హాల్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హుస్నాబాద్ మీదుగా రాత్రి 8 గంటలకు పోతారం చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. 27న పోతారం నుంచి బయలుదేరి ముల్కనూరుకు మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత బయలు దేరి సాయంత్రం ఎల్కతుర్తి సభకు చేరుకుంటారు. సభ అనంతరం సిద్దిపేట నుంచి వెళ్లిన బస్సుల్లో తిరుగు ప్రయాణమవుతారు.