దుబ్బాక, జూలై 14: సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు, కుంటలు ఆదరణకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మిషన్ కాకతీయ కింద గ్రామాల్లో చెరువులు, కుంటలకు మహర్దశ కలిగింది. గతంలో కరువుతో తల్లడిల్లిన దుబ్బాక నియోజకవర్గం ..నేడు నిండుకుండలా మారిన చెరువులు,కుంటలతో పరిఢవిల్లుతున్నది. మరోపక్క పచ్చని పంటలతో ఆహ్లాదకరం నెలకొంది. గతంలో ఎండిపోయిన చెరువులు,కుంటలతో ఉపాధి బాట పట్టిన మత్స్యకారులు, రైతులు ఇప్పుడు తిరిగివచ్చి గ్రామాల్లో సగౌరవంగా బతుకుతున్నారు. మిషన్‌కాకతీయ కింద దుబ్బాక నియోజకవర్గంలో చెరువులు,కుంటలు జలకళను సంతరించుకుని, మత్స్య సంపదతోపాటు సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1168 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందుకు 48,673 ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్‌కాకతీయ పథకంలో 718 చెరువులను రూ.14,381 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందులో ఫేస్-1లో రూ.4,619 కోట్లతో 239 చెరువులు, ఫేస్-2లో రూ.5,465 కోట్లతో 295 చెరువులు, ఫేస్-3లో రూ.2,401 కోట్లతో 83 చెరువులు, ఫేస్-4లో రూ.1,169 కోట్లతో 78 చెరువులను పునరుద్ధరించారు. పుడీకతీతతోపాటు కట్టల మరమ్మతుపనులు, కట్టపై సీసీ రోడ్డు, బతుకమ్మ ఘాట్లు నిర్మించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా జలకళతో చెరువులు, చేపలవేటతో మత్స్యకారులకు జీవనోపాధి మెరుగుపడింది. సీఎం కేసీఆర్‌తోనే గ్రామల రూపురేఖలు మారి, నిజమైన గ్రామ స్వరాజ్యంగా మారిందని అన్ని వర్గాల ప్రజలు సంబురపడుతున్నారు.
రూ.78.80 లక్షలతో పెద్దచెరువు పునరుద్ధరణ
దుబ్బాక, లచ్చపేట మధ్యనున్న పెద్దచెరువు పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. మిషన్‌కాకతీయ ఫేస్-3లో దుబ్బాక పెద్దచెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. రూ.78.80లక్షలతో పూడికతీతతోపాటు కట్ట మరమ్మతు పనులు, రేలింగ్, సీసీ నిర్మాణం చేపట్టారు. గతంలో భారీ వర్షాలు పడితేనే పెద్దచెరువు నిండి, మత్తడి దుంకేది. ఎండాకాలం రాకముందే ఈ చెరువులో నీటి చుక్కలేక ఏడారిగా మారేది. మిషన్‌కాకతీయతో చెరువులో పూడికతీత పనులు చేపట్టడంతో జలకళతో నిండుకుండలా మారింది. ప్రస్తుతం మండుటెండల్లో సైతం దుబ్బాక పెద్దచెరువులో నిండుగా నీరు ఉంది. చెరువుకు రెండువైపులా దుబ్బాక, లచ్చపేట ప్రజలకు ఉపయోగకరంగా బతుకమ్మ ఘాట్లు నిర్మించారు. ఈ చెరువు ద్వారా రెండు గ్రామాల మత్స్యకారులకు ఉపాధి అవకాశం పెరిగింది. వారితోపాటు ఇతర కులవృత్తులవారికి ప్రయోజనకరంగా మారింది. ఉదయం, సాయంత్రం ఈ చెరువుకట్టపై పాదచారులు విశ్రాంతి తీసుకుంటారు. ఓపెన్ జిమ్ ఏర్పాటుచేయటంతో ఆరోగ్యపరంగా ఉపయోగకరంగా మారింది. చెరువు కింద ఆయకట్టు 375 ఎకరాలు ఉంది. చెరువు నిండుకుండలా మారడంతో రైతులకు సాగునీటి సమస్య లేకుండాపోయింది.
చేపల పెంపకంతో ఉపాధి పెరిగింది..
గతంలో దుబ్బాక పెద్దచెరువు నిండాలంటే భారీ వర్షాలు పడితే తప్ప నిండేదికాదు. మిషన్ కాకతీయ కింద పెద్దచెరువు పూడికతీత పనులతోపాటు కట్ట నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చేపపిల్లలను చెరువులోకి వదలడంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. సీఎం కేసీఆర్ కృషితో చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరింది. సాగునీటితో రైతులకు సైతం ఇబ్బందులు లేకుండాపోయింది. చెరువులతోనే గ్రామం బాగుంటుంది. కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువులు నేడు కేసీఆర్ సర్కారులో పునరుద్ధరణకు నోచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– పెంటం రామచంద్రం, మత్స్యకారుడు(దుబ్బాక)