
దుబ్బాక, డిసెంబర్ 21: దుబ్బాక పట్టణంలో రూ. 18.5 కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ నెల 25వ తేదీన ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా వంద పడకల దవాఖాన భవనం ప్రారంభం కానున్నందున వాటికి సంబంధించిన పనులు జోరందుకున్నాయి. సోమవారం దవాఖానను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించిన అనంతరం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును కలిసి దవాఖాన ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీశ్‌రావు తొలిసారిగా దుబ్బాకలో వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవానికి వస్తున్నందున భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25వ తేదీన క్రిస్మస్ పర్వదిన కావడం..అదే రోజు దుబ్బాకలో వంద పడకల దవాఖానను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించడం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది.
పనులను పరిశీలించిన గడా వైద్యాధికారి
ఈ నెల 25వతేదీన మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా దుబ్బాకలో వంద పడకల దవాఖాన భవనం ప్రారంభోత్సవం ఉన్నందున, వాటికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం గడా వైద్యాధికారి డాక్టర్ జూలూరి కాశీనాథ్ పరిశీలించారు. దవాఖానలో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు, లైటింగ్, శానిటైజేషన్, పచ్చదనం తదితర పనులు కొనసాగుతున్నాయి. దవాఖాన ప్రారంభోత్సవ ఏర్పాటు పనులపై వైద్యాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. డీఈఈ విశ్వప్రసాద్‌తో భవనంలో మౌలిక వసతుల ఏర్పాటు పనులను వైద్యాధికారి అడిగి తెలుసుకున్నారు. దుబ్బాక సీహెచ్‌సీ వైద్యాధికారి జ్యోతి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి , పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, టీఆర్ఎస్ నాయకులు కొత్త కిషన్‌రెడ్డి, గన్నె భూంరెడ్డి, బండి రాజు పాల్గొన్నారు.