జహీరాబాద్, ఆగస్టు 2: పేదలకు కార్పొరేటు స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలున్న అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అంబులెన్స్‌లు నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేది. కొత్త అంబులెన్స్‌లు 15 నిమిషాల్లోనే ప్రమాదం జరిగిన స్థలానికి చేరేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్లో ఉంచేందుకు ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంబులెన్స్‌లు రోజంతా ఒకే చోట ఉంచకుండా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు సమీపంలో ఉంచేలా చేశారు. జహీరాబాద్ డివిజన్లో గతంలో 102 వాహనాలు రెండు ఉండేవి. ప్రస్తుతం జహీరాబాద్, రాయికోడ్‌లో రెండు కొత్త వాహనాలు అందుబాటులో ఉంచారు. జహీరాబాద్, రాయికోడ్తో పాటు కోహీర్, మొగుడంపల్లిలోనూ అత్యవసర సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
102 వాహనంలో ఆడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. గర్భిణులు, శిశువులకు అవసరమైన ఆక్సిజన్, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచారు. వాహనం ఎక్కడ ఉందో తెలుసుకునే టెక్నాలజీ ఏర్పాటు చేశారు. వాహనంలో మెరుగైన సౌకర్యాలు కలిపించారు.
– దేవయ్య, కేప్టెన్ జహీరాబాద్