దుబ్బాక, జనవరి 16: నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఉపకాల్వల పనులను వేగవంతం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. మంగళవారం సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన సమస్యలపై విన్నవించి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు ఫోన్లో తెలిపారు. కాళేశ్వరం, రంగనాయక సాగర్ నుంచి దుబ్బాక నియోజకవర్గం రైతులకు సాగునీరందించేందుకు కాల్వల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రామాయంపేట, చేగుంట, దుబ్బాక మండలాల్లో పలుచోట్ల పనులు నిలిచిపోయాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
వారం రోజుల క్రితం సిద్దిపేట కలెక్టరెట్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కాల్వల నిర్మాణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలను మంత్రికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మల్లన్నసాగర్ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో సుమారు లక్షా 30 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రధాన కాల్వల నుంచి ఉపకాల్వలు నిర్మించాల్సి ఉందని, పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చేగుంట, దుబ్బాక మండలాల్లో పనులు నిలిచిపోయాయని, మరికొన్ని చోట్ల భూ సమస్యలు, ఇతర వివాదాలు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌తో అన్ని గ్రామాలకు సాగునీరు సరఫరా చేసి, రైతులను ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి, ఆకుపచ్చ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.