
అక్రమ దందాలపై ఉక్కుపాదం
గుట్టురట్టు చేస్తున్న పోలీసులు
వరుస దాడులతో వ్యాపారుల్లో గుబులు
గుట్కా, జర్దా, పేకాట, పీడీఎస్ బియ్యం పట్టివేత
ఏడు నెలల్లో రూ. 28.95 లక్షల సొత్తు స్వాధీనం
మెదక్, జూలై 31 : మెదక్ జిల్లాలో అక్రమ దందాలపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడు లు నిర్వహిస్తూ వ్యాపారులకు దడ పుట్టిస్తున్నారు. ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నిత్యం దాడులు నిర్వహిస్తూ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ వ్యాపారం అరికట్టడానికి, నేర రహిత సమా జం కోసం టాస్క్ఫోర్స్, సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్) అనే బృందాలను 2019లో ఏర్పాటు చేశారు. దీంతో మెదక్ జిల్లాలో 2019 నుంచి జిల్లాలో టాస్క్ఫోర్స్ బృం దం పనిచేస్తున్నప్పటికీ, 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందం సుమారు రూ. కోటి అక్రమ వ్యాపార సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
జోరుగా పేకాట, పీడీఎస్ బియ్యం దందా…
మెదక్ జిల్లాలో అక్రమ వ్యాపారాలతో పాటు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట, ఇసుక వ్యాపారం, గుట్కా ప్యాకెట్లు, గంజాయి, నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ఇటీవల పేకాట ఆడుతున్న ముఠాను పట్టుకొని గుట్టు రట్టుచేశారు. జిల్లాలోని పలు కిరాణాషాపుల్లో గుట్కా, జర్దా ప్యాకెట్లు, ఎండుగంజాయి సేవించి అమాయక ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న పేకాట ఆడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీఎస్ బియ్యం దందాను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు…
జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు జిల్లాలో టాస్క్ఫోర్స్ బృందం దాడులు నిర్వహిస్తోంది. గుట్కా, జర్దా, పేకాట, పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా జిల్లా పోలీసు యం త్రాంగం ముందుకు సాగుతోంది. ఈ దాడులు ఇలాగే జరిగితే జిల్లాలో అక్రమ వ్యాపారానికి శాశ్వతంగా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
ఏడు నెలలు రూ. 28.95 లక్షల సొత్తు స్వాధీనం..
మెదక్ జిల్ల్లాలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఇప్పటి వరకు రూ.29 లక్షల అక్రమ వ్యాపార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 97 మందిపై కేసులు నమోదు చేశారు. గుట్కా రూ.21,60,000, పీడీఎస్ బియ్యం 16 టన్నులు పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న 9 వాహనాలను సీజ్ చేశారు. నకిలీ విత్తనాలు రూ.4.70 లక్షల విలువైనవి పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న 56 మందిని అరెస్ట్ చేసి రూ.3.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో 45 ట్రాక్టర్లు, లారీలు పట్టుకొని 60 మంది ని అరెస్ట్ చేశారు. ఆయా కేసుల్లో ఇప్పటి వరకు 97 మందిపై కేసు నమోదు చేశారు.
ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం..
జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గుట్కా, జర్దా, పేకాట, ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారిస్తున్నాం. నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నాం. ఎలాంటి వారినైనా వదిలేదిలేదు. జిల్లా టాస్క్ఫోర్స్ బృందంలో 14 మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు.