మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24 : భవిష్యత్ సౌరశక్తి దేనని.. ప్రతిఒక్కరూ సౌరశక్తిని వినియోగించుకోవాలని సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ముంబయి ఐఐటీ ఆచార్యులు డాక్టర్ చేతన్సింగ్ సోలంకి అన్నారు. ఆచార్య సోలంకి 2020లో చేపట్టిన దేశవ్యాప్త ఎనర్జీ సోలార్ బస్ యాత్ర గురువారం మెదక్ పట్టణానికి చేరుకుంది. ఈ యాత్రకు సిద్దార్థ్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి, ప్రిన్సిపాల్ సంధ్యారాణి ఘనస్వాగతం పలికారు. అనంతరం సిద్ధార్థ్ స్కూల్లో నిర్వహించిన సోలార్ అవగాహన సదస్సులో సోలంకి మాట్లాడారు. విద్యుత్ శక్తి వనరులను విచ్చలవిడిగా వినియోగించడంతో భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. సౌరశక్తి ప్రాధాన్యత, కార్బన్ ఉద్గారాలతో ప్రకృతిలో చాలా మార్పులు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సహజ వనరులు కొన్ని సంవత్సరాలకు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని, ఇప్పటి నుంచి సౌరశక్తి వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజలకు తెలియజేసేందుకే యాత్ర చేపట్టానని ఆయన వెల్లడించారు. అనంతరం సోలార్ బస్సులో సౌకర్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సౌరశక్తిని వినియోగిస్తామని విద్యార్థులతో సోలంకి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిద్ధార్థ్ విద్యాసంస్థల అధ్యాపకులు మశ్చేంద్రనాథ్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.