
రామాయంపేట రూరల్, నవంబర్ 22 :నేడు ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు, పండ్ల తోటలపై దృష్టి సారిస్తున్నారు. రామాయంపేట పట్టణానికి చెందిన మాసుల శ్యామల అనే మహిళా రైతు గతంలో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసింది. అయితే వాటికి పెట్టుబడులు, నీటి వినియోగం ఎక్కువ అవుతుంది. అందుకు భిన్నంగా ఆలోచించింది.
మండల పరిధిలోని జాన్సీలింగాపూర్ గ్రామంలో తనకున్న రెండు ఎకరాల భూమిలో సుమారు 10 రకాల పంట్ల చెట్లు పెట్టింది. జామచెట్లు 500, శ్రీగంధం 200, కొబ్బరి 50, బొప్పాయి 20, అరటి, సపోట, నిమ్మ, మామిడి, పెద్దజీడి, మిరప పెట్టింది. ఏడేండ్లుగా వీటిని సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నది. డ్రిప్పుతో పండ్ల చెట్లకు నీటిని పారిస్తోంది. అయితే భర్త ఆర్ఎంపీ డాక్టర్ కావడంతో మహిళా రైతు శ్యామల ఇద్దరు కూలీలను పెట్టి సేకరించిన పండ్లను మార్కెట్కు తరలిస్తోంది. కొందరు చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడకు వచ్చి మరి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.
మార్కెట్లో పండ్ల ధరలు..
కిలో జామ పండ్లు రూ.60, బొప్పాయి ఒకటి రూ.40 నుంచి 60 వరకు, సపోట రూ.60, అరటి పండ్లు డజను రూ.50, కొబ్బరిబోండా ఒకటి రూ.40, శ్రీగంధం, నిమ్మకాయలకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆదాయం కూడా ఇతర పంటల కంటే ఎక్కువగా రావడంతో పాటు కూలీల కొరత ఉండదు. అలాగే నీటి వినియోగం తక్కువ. మార్కెట్లో కూడా వీటిని కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువ. కొందరు పండ్ల వ్యాపారులు నేరుగా వ్యవసాయ భూమి వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో రవాణా ఖర్చులు కూడా తగ్గుతున్నాయని మహిళా రైతు శ్యామల అంటోంది.
ఒకే పంటతో లాభాలు రావు..
రైతులు వేస్తే ఒకే రకం పంట సాగు చేస్తారు. భిన్నంగా ఆలోచించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. వరి, ఇతర పంటల కంటే ఎక్కువ ఆదాయం, తక్కువ నీటి వినియోగం ఉంటుంది. అటువంటి వాటిపై దృష్టి సారించాలి. ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు, పండ్ల తోటలు, ఆరుతడి వంటివి ఎన్నో ఉన్నాయి. మొదట్లో చాలా మంది నిరాశ పరిచారు. కానీ, తర్వాత వారంతట వారే వచ్చి తాము కూడా ఇదే విధంగా సాగు చేస్తామని అంటుండడం సంతోషాన్ని ఇస్తున్నది.