రామాయంపేట, జూలై 30: మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం ఓఎస్డీ రాజశేఖర్‌డ్డి గ్రామాన్ని దత్తత తీసుకుని పోచమ్మ ఆలయాన్ని పునర్నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న దేవాలయంలో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే శనివారం దంపతులు రాజశేఖర్‌రెడ్డి-శిరీష దంపతులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదబ్రాహ్మణులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. వేడుకల సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలకు మెదక్ కలెక్టర్ హరీశ్, జిల్లాలోని పలువురు అధికారులు హాజరయ్యారు.