ధర్మశాల : భారత్, అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌కు వేళయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. ఏకైక టెస్టులో అఫ్గాన్‌పై రికార్డు విజయమందుకున్న భారత్..అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని చూస్తున్నది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉండటంతో జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ సిరీయస్‌గా దృష్టి సారించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని జట్టులోకి వచ్చిన స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మతో పాటు యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డిపై ప్రధానంగా దృష్టి నెలకొంది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో గాయపడి కోలుకున్న రోహిత్.. వరల్డ్ కప్ నాటికి పూర్తి స్థాయి ఫిట్నెస్తో అందుబాటులో ఉంటాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి వన్డేలో కెప్టెన్ శుభ్‌మన్‌గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. మరోవైపు తరుచూ గాయపడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యాకు బ్యాకప్‌గా తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌పై టీమ్‌మేనేజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే భారత్‌తో తొలిసారి వన్డే సిరీస్‌లో ఆడుతున్న అఫ్గానిస్థాన్ దీటైన పోటీనిచ్చేందుకు పట్టుదలతో ఉంది. స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ చేరిక జట్టు బలాన్ని పెంచింది.