
యాసంగి సాగుకు ప్రభుత్వం ముందస్తుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు జిల్లాల్లో వ్యవసాయశాఖ అధికారులు యాసంగి సాగుపై గ్రామాల వారీగా రైతులకు
అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డువడ్లు కొనడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచిస్తున్నది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన శనగ, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే వరిసాగు గణనీయంగా పెరిగింది. దీని స్థానంలో వరి సాగును తగ్గించి ఉద్యాన పంటలు సాగుచేసేలా రైతులను సన్నద్ధంచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, కేంద్రప్రభుత్వం దొడ్డువడ్లు కొనమని తేల్చిచెప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువశాతం రైతులు దొడ్డురకం వడ్లు పండిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
నవంబర్ నుంచి యాసంగి సాగుకు రైతులు సన్నద్ధం కానున్నారు. ఈలోగా రైతులకు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ వానకాలంలో ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా 9,55,600 మంది రైతులు 15,75,904 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో 5,32,827 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేశారు. ఇందులో వరి 3,12,927 ఎకరాల్లో, పత్తి 1,26,625 ఎకరాల్లో సాగు చేయగా, మిగతా అన్నిరకాల పంటలు వేశారు. పుష్కలంగా సాగునీరు ఉండడంతో ఈ జిల్లాలో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో 3,30,694 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేశారు. ఇందులో 2,56,207 ఎకరాల్లో వరి, 53,102 ఎకరాల్లో పత్తి పంటను, మిగిలిన పంటలను సాగు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో 7,12,383 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 1,12,138 ఎకరాల్లో వరిపంట, 3,61,099 ఎకరాల్లో పత్తి పంటను, మిగిలిన ఎకరాల్లో ఇతర పంటలు వేశారు.
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాం..
యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పొద్దుతిరుగుడు, పెసర, నువ్వులు, వేరుశనగ, శనగ పంటలతో పాటు కూరగాయల పంటలను సాగుచేయాలని సూచిస్తున్నాం. అన్ని గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతులు కూడా ప్రభుత్వం సూచించినట్లుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరుతున్నాం.
కొత్త రకం పంటలను సాగుచేద్దాం…
ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా వరి పంటకు బదులుగా కొత్త రకం పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతువేదికలు ఇందుకు వేదికలుగా మారాయి. వరి పంటను సాగుతో వచ్చే నష్టాలను రైతులకు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపడంతో రైతులు ప్రత్నామ్నాయ పంటల సాగువైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మన జిల్లాలో నల్లరేగడి, ఎర్ర నేలలు ఉన్నాయి. ఇక్కడి నేలల స్వభావాన్ని బట్టి రైతులు తమ పంటలను సాగుచేయాలి. కొత్తరకం పంటలు సాగుచేయడం, పంట మార్పిడి పాటించడం ద్వారా అధిక దిగుబడులు, మద్దతు ధరలు పొందవచ్చు. వరి తర్వాత ఉమ్మడి మెదక్జిల్లాలో ఎక్కువగా సోయాబీన్, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేస్తుంటారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర అంతంత మాత్రమే ఉంది. దీంతో రెండేండ్లుగా ఈ పంట సాగు తగ్గింది. సిద్దిపేట జిల్లాలో ఈ సారి కొత్తగా 3వేల ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగు చేపడుతున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో సైతం ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తోటలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు.
వరికి బదులుగా ఐదు రకాలు పంటలు..
యాసంగిలో రైతులు వరిపంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా యాసంగి సాగు ప్రణాళికలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. రైతులు తమ భూమిలో ఏ పంటలను సాగుచేయాలో ముందే నిర్ణయించుకోవాలి. నేల స్వభావం, విత్తే సమయం, నీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఎర్రనేలలు ఉన్న భూమిలో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, వినుములు, కుసుమ పంటలను, నల్లరేగడి భూమిలో ఆముదం, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, నువ్వులు పండించవచ్చు. రైతు విత్తే సమయం ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవాలి. ఈ కింది విధంగా పంటలను సాగు చేసుకోవాలి.