
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 6: జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి కురిసిన వర్షానికి పట్టణం తడిచి ముద్దయింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో 18వ వార్డు గాంధీనగర్లోని పలు ఇండ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాలనీలోని రోడ్లు కాల్వలను తలపించాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఏఎస్పీ కృష్ణమూర్తి, డీఎస్పీ సైదులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మోటర్ల సహాయంతో నీటిని తొలిగించారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే కారణం
గాంధీనగర్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోవడంతో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చాయని కాలనీ వాసులు మొర పెట్టుకున్నారు. సమస్యను ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు పలుసార్లు తెలియజేసిన పరిష్కరించలేదని కాలనీ వాసులు ఆరోపించారు. వంట సామగ్రితో పాటు పలు వస్తువులు నీటి పాలయ్యాయనినష్టపరిహారం చెల్లించాలని డిమా ండ్ చేశారు. పట్టణంలోని బృందావన్ కాలనీ, లక్ష్మీవర్ధ్దయ్య కాలనీ, ఇందిరపురి కాలనీ వరద నీరుతో జలమయమయ్యా యి. ముఖ్యంగా పట్టణంలో పలు కాలనీల్లో డ్రేనేజీ వ్యవస్థ లేకుండానే ఇండ్లు నిర్మించుకోవడం వల్ల వర్షపునీరు ఇండ్లలోకి వచ్చాయి.
బియ్యం, వంట సామగ్రి అందజేత
ఇండ్లలోకి వర్షపు నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి పోవడంతో కాలనీ ప్రజలకు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ 25 కిలోల బియ్యంతో పాటు వంట సామగ్రిని అందజేశారు. కాలానీలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి మరోసారి జరుగకుండా నూతన డ్రైనేజీ నిర్మిస్తామని కాలనీ వాసులకు తెలియజేశారు. పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పర్యటించి వర్షపు నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకున్నారు. చైర్మన్ వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, మామిళ్ల ఆంజనేయులు, కమిషనర్ శ్రీహరి, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, టీపీఎస్ లక్ష్మీపతి, రూరల్, పట్టణ పోలీసులు ఉన్నారు.
పొంగిపొర్లుతున్న చెరువు, కుంటలు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం రాత్రి వర్షం కురియడంతో చెరువు, కుంటల్లోకి నీరు చేరింది. మండలంలోని గజగట్లపల్లి , సంకాపూర్ చెరువులు పొంగిపొర్లుతున్నాయి.