
మనోహరాబాద్, జూలై 1 : గ్రామాలను పచ్చదనంతో నింపేద్దామని, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకుందామని, పల్లె ప్రగతిలో అందరం భాగస్వాములవుదామని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫే ర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ హరీశ్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల, చెన్నాపూర్ గ్రామాల్లో నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి, దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతితో నేడు తెలంగాణ పల్లెలు రోల్ మోడల్ విలేజ్‌లుగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ మన ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, దశాబ్దాలుగా జరుగని అభివృద్ధిని ఆరేండ్లలో చేసి చూపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రామాభివృద్ధి కోసం అడుగకముందే నిధులు మంజూరు చేస్తున్నారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలు సైతం గ్రామాభివృద్ధికి సహకరించాలని, పల్లె ప్రగతిలో చేయిచేయి కలిపి స్వచ్ఛ గ్రామంగా మార్చుకోవాలన్నారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతిని వినియోగించుకొని, సమస్యలు లేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని చెప్పారు.