సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): భారత దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా సుమారు 60వేల బాల్య క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ హెమటో అంకాలజి, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగాధిపతి డాక్టర్ శిరీషా రాణి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకుని నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెయిన్బో హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. అనంతరం డా.శిరీషారాణి మాట్లాడుతూ పిల్లలకు బాల్యంలో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతోనే రోజురోజుకూ ఈ బాల్య క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 4 లక్షల మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 60వేల కొత్త కేసులు నమోదు అవుతున్నట్లు వివరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం బాల్యంలో లుకేమియా, మెదడు కణితులు, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూమర్, ఎముక కణితులు, లింఫోమా వంటి ప్రాణాంతక క్యాన్సర్లు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న, ఆర్థికంగా వెనకబడిన దేశాలలోనే అధికంగా నమోదవుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బాల్య క్యాన్సర్లపై అవగాహన కల్పించడంతోపాటు 2030 నాటికి ఈ వ్యాధులను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకుంటుందన్నారు. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి, సకాలంలో సరైన చికిత్స అందిస్తే మన చిన్నారులను కాపాడుకోవచ్చని డా.శిరీషారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షో, పెయింటింగ్ సెషన్లలో దాదాపు 45 మంది బాల్య క్యాన్సర్ బాధిత పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.