జహీరాబాద్, నవంబర్ 7: అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించేందుకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వస్తున్నారని, ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. సోమవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వివిధశాఖల జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులతో ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు.
రేపు ఉదయం 10.30 గంటలకు జహీరాబాద్ మండలంలోని రంజోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించే మల్టీజోన్ క్రీడలను మంత్రి ప్రారంభిస్తారన్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారులు అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఆర్డీవో రమేశ్‌బాబు, డీసీవో ప్రసాద్, మెప్మా పీడీతో పాటు పలుశాఖల అధికారులు సమన్వయంతో మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మల్టీజోన్-2 స్థాయి క్రీడలను విజయవంతం చేసేందుకు పాఠశాల ప్రిన్సిపాల్, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. క్రీడాలు నిర్వహించేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రహ్మిత్నగర్లో పేదలకు పంపిణీ చేసే 312 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు మంత్రి అందజేయనున్నారని కలెక్టర్ తెలిపారు. మంత్రి లబ్ధిదారులతో కలిసి భోజనాలు చేస్తార అందుకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేశించాలన్నారు. అదేవిధంగా 3వేల మందితో అక్కడ సమావేశం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
జహీరాబాద్ పట్టణంలోని వివిధ కుల సంఘాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రతి కుల సంఘం నుంచి వంద మంది వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి సమక్షంలో నిధుల మంజూరుతో పాటు భూమి పత్రాలు అందజేస్తామన్నారు. ముస్లిం మైనార్టీలకు హోతి(కే) శివారులో షాదీఖాన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. నిధుల మంజూరు, ప్రభుత్వం భూమి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామంలో నిర్మించిన మైనార్టీ గురుకు పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడే అవకాశముంటుందని, అక్కడ సిద్ధంగా ఉంచాలన్నారు. అక్కడి నుంచి కోహీర్ మండలంలోని దిగ్వాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి లబ్ధిదారులకు అందజేస్తారన్నారు. దిగ్వాల్లో మంత్రి పర్యటన బాధ్యతలను అక్కడి ఎంపీడీవోకు అప్పగించారు.
సమావేశంలో జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీసీవో ప్రసాద్, డీఎస్పీ రఘు, మున్సిపల్ కమిషనర్ సుభాశ్‌రావు, తహసీల్దార్ స్వామి, ఎంపీడీవో సుమతి, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహినోద్దీన్, ఇజ్రాయిల్ బాబీ తదితరులున్నారు. అంతకుముందు జహీరాబాద్ పట్టణంలో నిర్మాణం చేస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ శరత్ పరిశీలించారు. పనులు నెల రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి పని చేయాలన్నారు.