
కల్హేర్, సెప్టెంబర్ 21 : పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్, బీజేపీ బూటకపు ఆరోపణలు చేస్తున్నాయని, మభ్యపెట్టాలని చూస్తే, ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కల్హేర్ మండలం కృష్ణాపూర్‌లో బీజేపీకి చెందిన ఉప సర్పంచ్ ఈశ్వర్, పార్టీ ముఖ్యనాయకులు దాడే పండరి, ఎల్లయ్య, బైరు శ్రీనివాస్, భూమయ్య, శంకర్ నాయక్, మల్దొడ్డి సంపత్, కర్రె సదానందం, కర్రె జైయిలు, బేగరి రాజుతో పాటూ 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీలను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, నియోజకవర్గంలో పాలించిన పాలకుల పాలనను, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిస్తున్న పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంటే పార్టీ, నాయకులపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ప్రజలంతా అమాయకులు కారని, రానున్న రోజుల్లో పాతాళానికి తొక్కుతారన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు అలీ, కృష్ణాపూర్ సర్పంచ్ కిష్టారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణాగౌడ్, నాయకులు ఉప్పరి అంజయ్య, శ్రీనివాస్‌గౌడ్, నాగిరెడ్డి, ముఖ్య కార్యకర్తలు ఉన్నారు.
ఆక్సిజన్ ప్లాంట్ నిరుపేదలకు వరం..
స్థానిక సర్కారు దవాఖానలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌లోని ఏరియా దవాఖానలో రూ.1.35 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. కరోనా బారిన పడిన వారు ఎంతో మంది సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని, అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. గతంలో ఏరియా దవాఖాన నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించే పరిస్థితి ఉండేదని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 100 పడకల దవాఖానతో పాటు 50 పడకల మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, మాజీ సర్పంచ్ నజీబ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ పరశురామ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ విజయ్‌బుజ్జి, దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నగేశ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.