మట్టి రోడ్ల స్థానంలో నిర్మాణం
ఈజీఎస్ కింద నిధుల వరద..
మెదక్ జిల్లాలో 21 మండలాల్లో 378 పనులు
రూ.28.97 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
పలుచోట్ల కొనసాగుతున్న పనులు
మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు
మెదక్, ఫిబ్రవరి 24:గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు కురిస్తే చిత్తడిగా మారే రోడ్లు.. ఎండాకాలంలో దుమ్ముధూళితో ప్రయాణికులు అనేక అవస్థలు పడేవారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో పల్లెల్లోని మట్టి రహదారులను సీసీ రోడ్లుగా మార్చేందుకు టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తెప్పించుకుని, మండలాలకు నిధులు కేటాయించింది. మెదక్ జిల్లాలో 21 మండలాల్లో మొత్తం 378 పనులకు రూ.28.97 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికే పలు చోట్ల పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రోడ్ల నిర్మాణాలను జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపడుతుండగా, మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో దశాబ్దాల నుంచి పడుతున్న ప్రయాణ కష్టాలు త్వరలో తీరనున్నాయని, సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని పల్లెప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చినుకు పడితే చిత్తడిగా మారే మట్టి రోడ్లు, పెద్ద పెద్ద గోతులతో ప్రయాణించాలంటేనే నరకప్రాయంగా మారిన రహదారులు.. నేడు సీసీ రోడ్లు మెరుగులు దిద్దుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని దారులను సీసీ రోడ్లుగా మారుస్తున్నది. రోడ్లు బాగాలేక పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులే నడవని దుస్థితి. మట్టి రోడ్లతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ గ్రామీణుల కష్టాలు తీరనున్నాయి. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్నారు.
పల్లెలకు కొత్త కళ..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెలకు కొత్త కళ వచ్చింది. దయనీయంగా ఉన్న గ్రామాల పరిస్థితి పల్లె ప్రగతి కార్యక్రమంతో వృద్ధిలోకి వచ్చింది. పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెలా నిధులు మంజూరుచేస్తున్నది. అంతేకాకుండా మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు వేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తీసుకుని, ఆ మేరకు నిధులు మంజూరు చేసింది.
ఉపాధి హామీ పథకం ద్వారా..
గ్రామీణ రోడ్ల దుస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు భారీగా నిధులు విడుదల చేసింది. మెదక్ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి సీసీ రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నియోజకవర్గాల వారీగా నిధులు మంజూరు చేసింది. అన్ని మండలాల్లో పనులు గుర్తించారు. మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో ఈజీఎస్ కింద మొత్తం 378 పనులకు ప్రభుత్వం రూ.28.97 కోట్లు మంజూరుచేసింది. జిల్లాలో మొత్తం 378 పనులకుగాను 111 పనులు గ్రౌండింగ్‌లో ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.
టీఆర్ఎస్ హయాంలోనే సీసీ రోడ్ల నిర్మాణం
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. గతంలో పల్లెల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈజీఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాకు రూ.28.97 కోట్లు మంజూరు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. పల్లె ప్రగతి ద్వారా పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు కృతజ్ఞతలు. – ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్