
మెదక్, అక్టోబర్ 1 : గ్రామ సీమలు కొత్తదనంతో మెరిసిపోతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. రోడ్లు, పచ్చదనం, మౌలిక వసతులు మెరుగుపడడంతో పల్లెప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లోనే ఊరు పరిధి చూపే బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెదక్ జిల్లాలోని జాతీయ రహదారి వెంట కాళ్లకల్, మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, రామాయంపేట, నిజాంపేట గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నాయి. జాతీయ రహదారి పొడవునా గ్రామ పంచాయతీ ముగింపు ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బోర్డులను ఏర్పాటు చేయించారు. ఈ బోర్డులకు గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేశారు. రెండు గ్రామాల మధ్య ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందితే ఆ వ్యక్తికి మరణ ధ్రువీకరణ పత్రం ఆ గ్రామ పంచాయతీ నుంచి కుటుంబ సభ్యులు తీసుకునేలా చర్యలు తీసుకుంటారు.
సులువుగా ప్రయాణం..
గతంలో ఒక ఊరికి వెళ్లాలంటే నానా కష్టాలు పడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఆ ఊరు పరిధి చూపించే బోర్డులను ఏర్పాటు చేసింది. ఒక గ్రామం పరిధి ప్రారంభం కాగానే ఆ గ్రామ పంచాయతీ పరిధి ప్రారంభం అని.. గ్రామ పంచాయతీ పరిధి ముగిసే ప్రాంతంలో పరిధి ముగింపు అని బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు తమ గ్రామాలకు వెళ్లే రోడ్డులో బోర్డులను చూసుకుంటూ వెళ్తున్నారు. కొత్తవారికి మార్గం సుగమమైంది. గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లేవారు, కొత్తవారు సైతం సులువుగా ప్రయాణం చేయడానికి ఈ బోర్డులు ఉపయోగపడుతున్నాయి.
మారిన పల్లెలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు పచ్చగా, స్వచ్ఛగా కనిపిస్తున్నాయి. పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురై అన్నిరంగాల్లో వెనుకబడ్డాయి. కనీసం ఊరిలోకి వెళ్దామంటే రోడ్లు లేని పరిస్థితి ఉండేది. ఎక్కడిచెత్త అక్కడే.. మోరీల్లో మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, దోమలు, ఈగలతో ప్రజలు రోగాల బారిన పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి దూరమైంది. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ శుభ్రంగా మారాయి. రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులు పల్లెలను శుభ్రం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌తో పాటు ట్యాంకర్, ట్రాలీలను ప్రభుత్వం సమకూర్చింది. తెల్లవారుజామునే చెత్త ట్రాక్టర్ గ్రామాల్లోనే ఆయా వీధుల్లో తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. పరిసర శివారులోని డంపింగ్ యార్డుల్లో నిల్వ చేస్తున్నారు. పల్లెల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడంతో పల్లెలు ఆహ్లాదకరంగా మారాయి.