మెదక్/ హవేళీఘనపూర్, మార్చి 9: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. బుధవారం అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేశారు. మెదక్ జిల్లాలో 1,146 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటనతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. హవేళీఘణపూర్‌లో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పటాకులు కాల్చుతూ స్వీట్లు తినిపించుకున్నారు. మెదక్, కొల్చారం, వెల్దుర్తి, పాపన్నపేటతో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

అసెంబ్లీలో బుధవారం సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడం హర్షనీయమని, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికే పని చేస్తుందని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హవేళీఘనపూర్‌లో తొగుట కామాన్ నుంచి చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ప్రకటించడం అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షా 33వేల 942 ఉద్యోగాలను భర్తీ చేశారని, నూతనంగా 80వేల 39 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటన జారీ చేసినట్లు తెలిపారు. అలాగే, 11వేల 139 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని తెలిపారు. జిల్లా స్థాయిలో నియమించే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించారన్నారు. 2కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని, మోడీని ప్రశ్నించేందుకు సత్తాలేని నాయకులు రాష్ట్రంలో నోరుపారేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మండల కో-అప్షన్ సభ్యులు ఖాలేద్, సర్పంచ్‌లు సవిత, దేవాగౌడ్, మహిపాల్, యామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు, టీఆర్ఎస్ నాయకులు గోపాల్‌రావు, నరేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, మంగ్యా, కృష్ణ, మేకల సాయిలు, ప్రవీణ్, యాదగిరి, శ్రీనివాస్‌గౌడ్, అజ్మీరాస్వామినాయక్, శ్రీను, చిట్యాల శ్రీనివాస్, రాజాసింగ్, సిద్దిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.