
కొల్చారం, అక్టోబర్ 1 : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గుంతల్లోకి వర్షపు నీరు చేరింది.. మురుగుకాల్వలు వరద నీటితో పొంగిపొర్లాయి.. దీంతో పరిసర ప్రాంతాలు, కలుషిత నీరు, గుంతల్లో నీటి నిల్వ ఉండడంతో అంటు వ్యాధులు, వైరల్ ఫీవర్లు వచ్చే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధులపై అవగాహనతో పాటు అప్రమత్తంగా ఉంటే వ్యాధులు దరిచేరవని వైద్యనిపుణులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులంటే జనం అల్లాడిపోతారు. వర్షాకాలం వచ్చిందంటే దోమకాటుతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులతో రోగులు దవాఖానకు క్యూ కడతారు. డెంగీ జ్వరానికి ప్రత్యేకమైన చికిత్స లేదు. ఈ జ్వరం వచ్చిన వారిలో తెల్ల, ఎర్ర రక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు రక్తంలోని కీలకమైన ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. వ్యాధి లక్షణాలు, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల అవగాహన పెంచుకుంటే డెంగీ జ్వరం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు.
వ్యాధి వ్యాప్తి విధానం..
ఆర్బోవైరస్ అనే అత్యంత సూక్ష్మమైన వైరస్‌తో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరి దోమకాటుతో వ్యాపిస్తుంది. డెంగీ సంక్రమణ దోమలు పగటి పూట కాటు వేస్తాయి. ఈ రకం దోమలు నిల్వ ఉన్న నీటిలో బాగా వృద్ధి చెందుతాయి.
జాగ్రత్తలు..
డెంగీ నివారణకు చికిత్స..
డెంగీ అనేది ఒకరకమైన విషజ్వరం. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమిలేదు. ముఖ్యంగా ఈ విషజ్వరం రాకుండా జాగ్రత్తలు పాటించి, వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ వ్యాధి సోకిన వారికి వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్యులు వైద్యం అందిస్తారు. ఈ వైరల్ జ్వరం దానంతటదే తగ్గాలి. ఈ జ్వరంతో బాధపడుతున్నవారికి వాంతులు వస్తే వాంతులు, దురద, జ్వరం తీవ్రతను తగ్గించడానికి మందులు ఇస్తారు. స్లైన్లతో శరీరంలోని జీవద్రవం తగ్గకుండా ఉండడంతో పాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గకుండా అరికడుతుంది. ఈ వ్యాధి సోకిన వారికి యాంటిబయాటిక్స్ కూడా పనిచేయవు. కేవలం వేరే ఇన్ఫెక్షన్లు వ్యాధిగ్రస్తుడికి సోకకుండా ఉండేందుకు సాధారణ యాంటిబయాటిక్స్‌ను వాడతారు.
ఆందోళన వద్దు..
డెంగీ జ్వరం వచ్చిందంటే కుటుంబం మొత్తం ఆందోళన చెందుతారు. డెంగీ వ్యాధిపై అవగాహన ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. డెంగీ లాంటి ఇతర విషజ్వరాలు ప్రబలడానికి దోమలే ప్రధాన కారణం. ముందుగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణపై శ్రద్ధ పెడితే జ్వరాలు రాకుండా తమను తాము కాపాడుకోవచ్చు. డెంగీ జ్వరం వచ్చిన వారిలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ప్లేట్లెట్స్ 1.50 లక్షల నుంచి 30వేల వరకు తగ్గినా బయపడాల్సిన అవసరం లేదు. అంతకంటే తగ్గితెనే రోగికి ప్లేట్లెట్స్ అందజేయాల్సి ఉంటుంది.