
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 6: చెరుకు సాగుచేస్తున్న రైతులెవరూ అధైర్య పడొద్దని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. చివరి చెరుకు గడ వరకు క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలిసి ట్రైడెంట్ చక్కెర కర్మాగారం, గణపతి షుగర్స్, గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు సాగుచేస్తున్న రైతులు ఏ విధంగా నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే క్రషింగ్ ప్రారంభించాలని సంబంధిత యాజమాన్యాలకు ఆదేశించామని స్పష్టం చేశారు. జిల్లాలో సాగైన మొత్తం చెరుకు క్రషింగ్ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సంగారెడ్డిలోని గణపతి షుగర్, గాయత్రీ షుగర్, కామారెడ్డి మాగి షుగర్, కొత్త కోట ఫ్యాటరీలకు తరలిస్తామన్నారు. ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు జహీరాబాద్ ప్రాంత చెరుకును క్రషింగ్ చేయడానికి సమ్మతించాయని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, డీఎస్ఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, చక్కెర శాఖ కమిషనర్ బద్రుమాల్, ఏడీ రవీందర్, ట్రైడెంట్ చక్కెర కర్మాగారం చైర్మన్ నందకుమార్, ఆయా చక్కెర ఫ్యాక్టరీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ ఏడీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.