సదాశివపేట, మార్చి 26: కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేట కౌన్సిలర్లు తీర్మానించారు. శనివారం సదాశివపేట పురపాలక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ కౌన్సిలర్లు తీర్మానం చేసి కమిషనర్ కృష్ణారెడ్డికి ప్రతిని అందజేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సదాశివపేటలో ఆదివారం, బుధవారం జరిగే సంతలో తైబజార్ ఎత్తివేయాలని కమిషనర్‌ను కౌన్సిలర్లు కోరారు. సమావేశంలో వైస్ చైర్మన్ చింత గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు, కిషన్ పాల్గొన్నారు.
న్యాల్కల్లో..
న్యాల్కల్, మార్చి 26: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి సాయిలు అన్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతిఒక్కరూ పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో జీపుజాత పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు మహిపాల్, కృష్ణ, సంగన్న, కిష్టన్న, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో
యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని పంచాయతీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించారు. యాసంగిలో పండిన ధాన్యాన్ని పంజాబ్ తరహా సేకరించేందుకు కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేశారు. ఆనంతరం పోస్టాఫీస్‌లో రిజిస్టర్ పోస్టులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూస్ గోయల్‌కు పంపించారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌లు మారుతీయాదవ్, పీటర్రాజ్, మహిపాల్ పాల్గొన్నారు.
ఝరాసంగంలో..
యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనాలని మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం తీర్మానించి, కేంద్ర ప్రభుత్వానికి పోస్ట్‌లో పంపారు.