గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు, పరస్పర దాడులు, టికెట్ల లొల్లి సంగారెడ్డి జిల్లా బీజేపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల తీరుతో పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీరని నష్టం జరిగే అవకాశం ఉందని సొంత పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, కొద్దికాలంగా ఆయనపై నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. బుధవారం ఝరాసంఘం మండలం బర్థిపూర్లో నిర్వహించిన భరోసా యాత్రలో ఏకంగా నరేందర్రెడ్డిపై దాడి జరగడంతో పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరికి వారే సొంత ఎజెండాతో పనిచేస్తుండడంతో ద్వితీయశ్రేణి ఎవరి వెంట వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నది.
సంగారెడ్డి, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): క్రమశిక్షణకు మారుపేరుగా గొప్పలు చెప్పుకుంటున్న కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గ్రూపుల లొల్లి రచ్చకెక్కి ఏకంగా కొట్టుకునే స్థాయికి చేరాయి. సంగారెడ్డి జిల్లాలో ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిపైనే సొంత పార్టీ నేతలు దాడులకు పాల్పడడం కలకలం సృష్టించింది. జిల్లా అధ్యక్షుడిపైనే నియోజకవర్గ స్థాయి నేతలు తిరగబడి దాడులు చేయడంతో అధిష్టానం పెద్దలు నివ్వెరపోయారు. రోజురోజుకూ రచ్చకెక్కుతున్న అంతర్గత విబేధాలతో పార్టీ పరువు బజారున పడుతున్నదని అధిష్టానం తలపట్టుకుంటోంది. ఇప్పుడు సొంత పార్టీ అధ్యక్షుడిపైనే దాడి జరగడంతో ఆ పార్టీ పెద్దలకు ఏమి చేయాలో తోచని పరిస్థితి నెలకొంది.
సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ నేతల్లో గ్రూపులు ఉన్నాయి. నియోజకవర్గ స్థాయి నేతలు గ్రూపులు కట్టడంతో అంతర్గత విభేదాలు పెరిగి పార్టీకి తీరని నష్టం జరుగుతోందని సొంత పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి తీరుకు తోడు పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో బీజేపీలో గ్రూపు తగాదాలు పెరుగుతున్నాయి. పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి గ్రూపులను మరింత ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో దేశ్‌పాండే, వేణుమాధవ్, జగన్, చంద్రశేఖర్ ఎవరికి వారే గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. సదాశివపేటలో రెండు నెలల క్రితం దేశ్‌పాండే, వేణుమాధవ్ అనుచరుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఫ్లెక్సీల కోసం ఇరువర్గాల నాయకులు జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి సమక్షంలో దాడులకు పాల్పడ్డారు. అందోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, జడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య ఇరువర్గాలుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఇద్దరు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. బాబూమోహన్ తీరు సరిగ్గా లేదంటూ బాలయ్య అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పటాన్చెరు నియోజకవర్గ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు అంజిరెడ్డి, బీసీ నేత శ్రీకాంత్‌గౌడ్ గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే సొంత ఎజెండాతో పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ఈ నలుగురు నాయకులు పోటీపడుతున్నారు. దీంతో కేడర్ ఎవరి వైపు ఉండి పనిచేయాలో తెలియక సతమతమవుతున్నది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని పటాన్చెరు నియోజకవర్గ ద్వితీయశ్రేణి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి, రాష్ట్ర సంగప్ప మధ్య గ్రూపు విభేదాలు ఉన్నాయి.
జిల్లా అధ్యక్షుడిపై దాడికి కారణమిదేనా..?
బుధవారం ఝరాసంగం మండలం బర్ధీపూర్ గ్రామంలో భరోసా యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన జంగం గోపీ, ఇటీవలే పార్టీలో చేరిన చింతలఘాట్ సుధీర్ మధ్య కొన్నిరోజులుగా విభేదాలు ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా సుధీర్‌ను ప్రోత్సహిస్తున్నాడని జంగం గోపి గుర్రుగా ఉన్నాడు. బుధవారం తన నియోజకవర్గంలోని బర్ధిపూర్కు వచ్చిన నరేందర్‌రెడ్డితో జంగం గోపీతో పాటు ఆయన అనుచరులు గొడవకు దిగారు. జిల్లా అధ్యక్షుడి తీరుపై జంగం గోపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అకస్మాత్తుగా దాడి పాల్పడ్డాడు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. జంగం గోపి, సుధీర్ వర్గానికి చెందిన అనుచరులు పరస్పరం దాడికి దిగారు. సొంత పార్టీ నాయకులు పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రజల కోసం పోరాటం చేస్తామంటూ వచ్చిన బీజేపీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడం చూసి బర్ధిపూర్ గ్రామస్తులు నివ్వెరపోయారు. జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు జంగం గోపి గతంలోనూ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై చిరాగ్పల్లి పోలీస్టేషన్లో నరేందర్రెడ్డిపై జంగం గోపి అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే అధిష్టానం పెద్దలు నచ్చజెప్పడంతో ఆయన కేసు వెనక్కి తీసుకున్నారు. తాజాగా మరోమారు జంగం గోపి జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డిపై దాడికి పాల్పడడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తనపై దాడి జరగడంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర నాయకత్వానికి జంగం గోపిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి తీరుపై ఇటీవల పార్టీ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నరేందర్‌రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నరేందర్రెడ్డిపై పార్టీలోని సీనియర్ నాయకులు ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయనను తొలిగించాలని కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పదవీకాలం ముగుస్తుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని అధిష్టానం సూచించటంతో జిల్లాలోని ముఖ్యనేతలు జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి విషయంలో సంయమనంతో ఉన్నట్లు సమాచారం. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలకు పోటీగా మరో నాయకుడిని జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి ప్రోత్సహిస్తుండడం చాలా మందికి మింగుపడడం లేదు. ఈ కారణంగానే జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డిపై జంగం గోపి అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలిసింది.