సంగారెడ్డి నవంబర్ 1(నమస్తే తెలంగాణ) :జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు అందరూ ఉండే కలెక్టరేట్లో సోమవారం ఏసీబీ దాడులు జరగడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రెండో అంతస్తులో ఉన్న జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో మధ్యాహ్నం 3.30గంటలకు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ మహిళ నుంచి రూ.20వేల లంచం తీసుకుంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ అసిఫ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. మధ్యాహ్నం 3.30గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఏసీబీ అధికారులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఏడీ మధుసూదన్‌తోపాటు ఇతర సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏడీ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ అసిఫ్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ అనంద్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన ఓ మహిళకు 1.29 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి సర్వే చేయించి నివేదిక ఇప్పించాలని మహిళ కోర్టును ఆశ్రయించింది. మహిళకు చెందిన 1.29 ఎకరాల భూమిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సర్వే అధికారులు సెప్టెంబర్‌లో నందిగామ గ్రామంలో మహిళకు చెందిన 1.29 ఎకరాల భూమిని సర్వే చేశారు. నిబంధనల మేరకు సర్వే నివేదికను నిర్ణీత సమయంలో అందజేయాల్సి ఉన్నది. అయితే సర్వే చేసి రెండు నెలలు పూర్తయినా జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం నుంచి ఎంతకూ సర్వే నివేదిక మహిళకు అందలేదు.
దీంతో సంగారెడ్డి కలెక్టరేట్లో ఉన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాన్ని మహిళ సంప్రదించింది. అయినా అధికారుల నుంచి స్పందన కనిపించలేదు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అసిఫ్ ద్వారా ఏడీ మధుసూదన్‌ను కలిసింది. సర్వే నివేదిక కోసం ఏడీ, జూనియర్ అసిస్టెంట్ లంచం ఇవ్వాలని కోరారు. సర్వే అధికారులు లంచం కోరుతుండటంతో మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ అధికారులు సూచన మేరకు మహిళ సోమవారం మధ్యాహ్నం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్, అసిఫ్కు రూ.20వేలు లంచం అందజేసింది. మహిళ నుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఏడీ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ ఆసిఫ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇద్దరు రూ.10వేలు తీసుకున్నారు : అనంద్ కుమార్, ఏసీబీ డీఎస్పీ
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ రూ.20వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కినట్లు ఏసీబీ మెదక్ రీజియన్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి చెందని ఓమహిళ నుంచి ఏడీ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ ఆసిఫ్ ఇద్దరు రూ.10వేల చొప్పున లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ దాడి కలకలం రేపింది.