
గజ్వేల్,జూన్27: తెలంగాణ రాష్ట్రం రాకముందే ప్రజలు పడ్డ గోసకు, ఏడేండ్లలో జరిగిన మార్పును ప్రజలు ఒక్కసారి గమనించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇటిక్యాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాకముందు గ్రామాల్లో తాగు,సాగు నీరు లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రత్యేకరాష్ట్రం సాధించి సీఎం కేసీఆర్ వచ్చాక ఇంటింటికీ తాగునీరు, అన్ని గ్రామాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులతో పాటు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాలతో పాటు ఉచిత విద్యుత్ అందిస్తూ గుణాత్మక మార్పులు సాధించామని మంత్రి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపించిందన్నారు. రైతుబంధుతో రైతులు అప్పుల పాలు కాకుండా, రైతు బీమాతో మృతి చెందిన రైతుకుటుంబాలు రోడ్డున పడకుండా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. పలు కారణాలతో రైతుబంధు అందని కొద్ది మంది రైతులున్నారని, వారి సమస్యల్ని కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
మోకా మీద ఉన్నవారికే పాసుబుక్కులు ఇచ్చేందుకు సర్వే..
గతంలో పలువురు చేసిన తప్పిదాలతో భూ రికార్డులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు పూర్తి న్యాయం చెయడానికి సీఎం కేసీఆర్ భూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. మోకామీద ఉన్న రైతులకు సంబంధించిన భూమికి హద్దులు నిర్ణయించి వారికి పాస్‌బుక్కులు ఇచ్చేందుకు సర్వే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.
కేజ్ వీల్స్ ట్రాక్టర్లు తారురోడ్లపైకి వెళ్లొద్దు
కేజ్‌వీల్స్ ట్రాక్టర్లను రోడ్లపైకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులదేనని మంత్రి అన్నారు. దీనివల్ల ఎంతోకాలం ఉండాల్సిన తారురోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని, కాబట్టి రోడ్లపై రాకుండా చూడాలన్నారు. ఎవరైనా కేజ్‌వీల్స్ ట్రాక్టర్లను రోడ్లపై తిప్పితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనాతో ప్రభుత్వానికి రాబడి లేకపోవడం వల్ల రైతులకు రుణమాఫీ, పేదలకు ఇండ్ల నిర్మాణంలో కొంత ఆలస్యమైందన్నారు. త్వరలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని, హామీ ఇచ్చినట్లుగా రెండు హామీలను త్వరలోనే నెరవేర్చమని మంత్రి స్పష్టం చేశారు.