
సిద్దిపేట, జులై 1 : ఆరోగ్యవంతమైన సమాజాన్ని రేపటి తరానికి బహుమతిగా, ఆస్తిగా ఇద్దామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చో నేర్పించేందుకే స్వచ్ఛబడి ఏర్పాటైందన్నారు. గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేట స్వచ్ఛబడిని మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు చెత్త గురించి పాఠాలు నేర్పేదే సిద్దిపేట స్వచ్ఛబడి అన్నారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చి, చెత్త రహిత పట్టణంగా మార్చడమే ద్యేయంగా అడుగులేస్తున్నామన్నారు. చెత్తతో గ్యాస్ తయారు చేసే ఆలోచనతో ముందుకెళ్తున్నామన్నారు. త్వరలోనే చెత్తతో గ్యాస్ వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. రేపటి భవిష్యత్‌కు చక్కటి ఆరోగ్యాన్ని అందించేందుకు చేపట్టిన ప్రయత్నమే స్వచ్ఛబడి అన్నారు. ఆరోగ్య సిద్దిపేట, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. 39వ మున్సిపల్ వార్డు కంపోస్టు యార్డులో చెత్తతో తయారైన సేంద్రియ ఎరువులను పరిశీలించారు. సేంద్రియ-ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన కూరగాయల తోటను పరిశీలించి, అందులో పెరిగిన క్యాబేజీని మంత్రి తీసుకున్నారు. కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ఏఎంపీ చైర్మన్ సాయిరాం, సుడా డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్ దీప్తినాగరాజు తదితరులు పాల్గొన్నారు.