గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Feb 10, 2020 , 02:03:15

గాంధారి ఖిల్లా..జన సంద్రం

గాంధారి ఖిల్లా..జన సంద్రం

రామకృష్ణాపూర్‌ : మందమర్రి మండలం బొక్కలగుట్ట పంచాయతీ పరిధిలో గల బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి మైసమ్మ జాతర ప్రశాంతంగా ముగిసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు మైసమ్మ తల్లికి ప్రధాన పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శించుకోవడం ప్రారంభమైంది. ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి ఆదివాసీ నాయక్‌ పోడ్‌ గిరిజనులు, సంఘాల నాయకులు, జాతరకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 10 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు కోళ్లు, మేకలు, గొర్రెలు, కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లించుకున్నారు. నాయక్‌ పోడ్‌ కులవంశం సంప్రదాయం ప్రకారం సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తప్పెటగూళ్లు, పిల్లన గ్రోవులు, లక్ష్మీదేవర, కృష్ణుడు, ముఖచిత్రాల నృత్యాలతో అంగరంగ వైభవంగా ముగిసింది. జాతరలో అన్ని ప్రభుత్వ విభాగాలు పాల్గొని పనిచేయడంతో ప్రశాంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.. 

గాంధారి ఖిల్లాను అన్ని రకాల అభివృద్ధి చేయాలని నాయక్‌ పోడ్‌ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సత్యనారాయణ కోరారు. జాతర ముగింపు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాదర్బాలో పాల్గొని ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జరిగే జాతర నాటికి విద్యుత్తు, మంచినీరు, రోడ్లు పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేవాలయం విషయంలో నాయక్‌ పోడ్‌ సంప్రదాయ పద్ధతిలో కోటను తిరిగి పునఃనిర్మాణం చేయాలని కోరారు. సీఎం చంద్రశేఖర్‌రావు దేవాలయాలపై భక్తిశ్రద్ధలు ఉన్న వ్యక్తి అన్నారు. కేస్లాపూర్‌, సమ్మక్క-సారలమ్మ జాతరల మాదిరిగా అభివృద్ధి చేయాలని కోరా రు. కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర కూటులు నిర్మించిన గాంధారి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సు లు నడిపించేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ఈ జాతరను ఎక్కువగా ప్రచారం చేసి భక్తులు అధికంగా వచ్చేలా చూడాల్సిన బాధ్యత వంశస్తుపై ఉంది. జాతరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ.. దర్బార్‌కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం బాధ కలిగిస్తుందని నాయక్‌ పోడ్‌ సేవా సంఘం రాష్ట్ర సాంస్కృతిక  ప్రధాన కార్యదర్శి పసుల బుచ్చయ్య పేర్కొన్నారు. దర్బార్‌లో మందమర్రి జడ్పీటీసీ ఏల్పుల రవి, వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌, బొక్కలగుట్ట సర్పంచ్‌ సువర్ణ, తాసిల్దార్‌ మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ కనకయ్య, నాయక్‌పోడ్‌ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్ల సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య, సాంస్కృతిక కార్యదర్శి మేసినేని రాజయ్య, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ రొడ్డ రమేష్‌, జిల్లా అధ్యక్షుడు పెద్ది రాజన్న, ప్రధాన కార్యదర్శి జేత శేఖర్‌, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు గంజి రాజన్న, వివిధ జిల్లాల సంఘం బాధ్యులు, అధికారులు పాల్గొన్నారు.


logo