గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Feb 08, 2020 , 04:07:01

గోదావరి జలాలతో భీమన్నకు పూజలు

గోదావరి జలాలతో భీమన్నకు పూజలు

రామకృష్ణాపూర్‌: మందమర్రి మండలం బొక్కలగుట్ట పంచాయతీలోని గాంధారిఖిల్లాలోమైసమ్మ జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి నాయక్‌పోడ్‌ రొడ్డ వంశస్తుల పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గిరిజన అభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనంతలక్ష్మి సందర్శించి పనులను పరిశీలించారు. నాయక్‌పోడ్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో మొదట సదర్ల (దారి) భీమన్న వద్ద పూజలు చేశారు. అక్కడ గాంధారి ఖిల్లా జాతర పనులను అన్నిశాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గాంధారి మైసమ్మకు అన్ని శాఖల సమన్వయంతో మిగిలిన  పనులు పూర్తి చేయాలని సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుకుండా తాగునీరు, టాయిలెట్లు నిర్మించారు. జాతరలో వైద్య శిబిరం, వివిధ విభాగాల శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, జాతరలో షీటీమ్‌ల గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.  8న నాయక్‌పోడ్‌ సంప్రదాయ కళారూపాల ఆటాపాటా ఉంటుందన్నారు. 9న ప్రజా దర్భార్‌ ఉంటుందని తెలిపారు. గిరిజన సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయక్‌పోడ్‌ సేవా సంఘం అధ్యక్షుడు పల్ల సత్యనారాయణ, పెద్దిరాజన్న, గంజి రాజన్న,  రొడ్డ రమేశ్‌, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి మేచినేని రాజయ్య, నాయక్‌పోడ్‌ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సదర్ల భీమన్నకు పూజలు

బొక్కల గుట్ట గ్రామ సమీపంలోని సదర్ల (దారి) భీమన్నకు నాయక్‌పోడ్‌ పూజారులు రొడ్డ రాజయ్య, లౌవుడం మైసయ్య, పెద్ది చంద్రయ్య, పెద్ది చిన్నయ్యొలికినేని రవి,గరిగంటి భీమయ్య సదర్ల భీమన్న వద్ద పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తప్పెటగూళ్ల దరువు చప్పుళ్ల తో ఊరేగింపుగా కాలినడకన భీమన్న దేవుడిని మంచిర్యాల గోదావరికి తీసుకెళ్లారు.దేవతా విగ్రహాలను గంగాజలంతో అభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించి తిరిగి సాయంత్రానికి బొక్కల గుట్ట గ్రామానికి చేరుకున్నారు. దేవుళ్లను యథాస్థానంలో ప్రతిష్ఠ చేసి రాత్రి ఆటపాటలతో గడుపుతారు. దీంతో మొదటి రోజు గడిచిపోతుంది. ఈ కార్యక్రమంలో గాంధారి మైసమ్మ ఆలయకమిటీ సభ్యులు రొడ్డ రమేష్‌, నాయక్‌పోడ్‌ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్ల సత్యనారాయణ,  గంజి రాజన్న,  పెద్ది రాజయ్య, మేసినేని రాజయ్యలు తదితరులు గోదావరికి కాలినడకన వెళ్లిన వారిలో ఉన్నారు.

గోదావరికి బయలుదేరిన ఆదివాసీలు

కాసిపేట : మండలంలోని దేవాపూర్‌లోని ఆదివాసీ నాయక్‌పోడ్‌లు శుక్రవారం సల్పాల వాగు సమీపంలోని గజాల భీమన్న దేవర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, నిర్వహించి మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు బయలుదేరి వెళ్లారు. ఆలయం నుంచి కాలినడక వెళ్లి మంచిర్యాల గోదావరి గంగా జలం తీసుకువచ్చి మైసమ్మ ఆలయంలో నాయక్‌పోడ్‌లు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయక్‌పోడ్‌లు కొమ్ముల బాపు, రొడ్డ కిన్న రమేశ్‌ పాల్గొన్నారు. 


logo