వనపర్తి, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : దేశ రక్షణతోపాటు మంచి భవిష్యత్ కోసం యువత అగ్నివీర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వాయుసేన రీసోర్స్ పర్సన్, కల్నల్ వి.సందీప్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని డిగ్రీ కళాశాల ఆడిటోరియం హాల్లో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన అగ్నివీర్ అవగాహన సదస్సులో కల్న ల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17-21 ఏండ్ల వయస్సు ఉన్న యువతీ యువకులు అగ్నివీర్లో చేరి దేశ రక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఇందులో వాయుసేన, నేవీ, ఆర్మీ అనే మూడు విభాగాలుంటాయని, ఎంపికైన రోజు నుంచి ప్రారంభంలోనే నెలకు రూ.30వేల వేతనం ఉంటుందన్నారు. ఆరు నెలలు శిక్షణ అనంతరం మూడేండ్ల ఆరు నెలలు సర్వీస్ చేయాల్సి ఉంటుందన్నారు. అగ్నివీర్లు సాయుధ దళంలో విశిష్టమైన ర్యాంకును కలిగి ఉంటారని, వ్యవధి పూర్తయిన తర్వాత ఇతర రంగాల్లో ఉపాధి కోసం క్రమశిక్షణ, చైతన్యవంతమైన, ప్రేరేపిత మరియు నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్‌గా సమాజంలోకి వెళ్లవచ్చన్నారు. నాలుగేండ్ల తర్వాత అగ్నివీర్లకు రూ.11.71 లక్ష ల సేవానిధి ఇస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో సైనికులుగా కొంతకాలం పనిచేసేందుకు గానూ అగ్నివీర్‌ను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికా రి టి.సుధీర్‌కుమార్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి ధాం సింగ్, జిల్లా సమాచారశాఖ అధికారి సీతారాం, ఉమ, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.