గద్వాల, సెప్టెంబర్ 22 : నడిగడ్డలో రోజురోజుకూ యువత పెడదారిపడుతున్నది. మాదక ద్రవ్యాల మత్తుకు అలవాటుపడడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. తెలిసీతెలియని వయస్సులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. కానీ వారు చేస్తున్న పనులకు తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. తమ పిల్లలు కళాశాలకు వెళ్లి బాగా చదువుకొని ప్ర యోజకులు అవుతారని తల్లిదండ్రులు కలలు కంటుండగా.. వారు బయట చేస్తున్న పనులకు పొంతన లేకుండాపోతున్నది. దీంతో తల్లిదండ్రులకు మనోవేదన తప్ప డం లేదు. సోషల్ మీడియాలో రీల్స్‌ను చూసి నడిగడ్డ యువత పెడదారి పడుతున్నట్లు సమాచారం.
గతంలో న్యూడ్ కాల్స్‌తో గద్వాల పరువును బజారుకీడ్చారు. కొంతమంది నాయకులు ఆ కేసును బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ప్రస్తుతం యువత మత్తుకు అలవాటు పడి విద్యార్థినులు, యువతులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ కారణంగా తమ బిడ్డలను పాఠశాల, కళాశాలకు పంపాలంటేనే అమ్మాయిల తల్లిదండ్రు లు భయపడుతున్నారు. జిల్లాలో ఈ ఒక్క నెలలోనే అమ్మాయిలపై లైంగిక వేధింపుల కేసులు రెండు నమోదు అయ్యాయంటే యువత ఎంత పెడదారి పట్టిందో అర్థమవుతున్నది. నడిగడ్డలో జరుగుతున్న లైంగిక వేధింపులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయకపోతే బాలికలు, యువతులు, మహిళలు బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. ముఖ్యంగా నడిగడ్డలో గంజాయి మూలాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 19 నుంచి 22 ఏండ్లలోపు యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడుతూ ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి నెలకొన్నది.
అటు గద్వాల మండలంలో, ఇటు కేటీదొడ్డి మండలం లో విద్యార్థినులు, యువతిపై లైంగిక దాడికి గురైన బాధితులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేటీదొడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా ఆమె మృ తికి కారణమైన వారిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై హత్యా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 19 ఏండ్లలోపు యువకులు పె డదారిపట్టి మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తె లుస్తుందని వీటన్నింటిపై పోలీసులు దృష్టి సారించాలని వారు డి మాండ్ చేస్తున్నారు.
గద్వాల నియోజకవర్గంలో విద్యార్థినులపై లైం గిక వేధింపులు ఈ నెలలోనే రెండు చోట్ల చోటు చేసుకున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పా ఠశాలలో గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ గ్రా మానికి చెందిన ఇద్దరు బాలికలు చదువుతుండ గా.. వారిని మీ పాఠశాల దగ్గర దింపుతామని యువకులు తీసుకెళ్లి లైంగికంగా వేధించారు. వీరికి మరో ముగ్గురు యువకులు తోడై అసభ్యం గా ప్రవర్తించడంతోపాటు ఓ గదిలో బంధించి లైంగికంగా వేధించినట్లు తెలిసింది. సదరు విద్యార్థినులు ఇంటికి ఆలస్యంగా వెళ్లడంతో తల్లిదండ్రులు ఆరాతీయగా.. జరిగిన విషయం చెప్పారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారంతా 19 నుంచి 22 ఏండ్లలోపు వారే కావడం గమనార్హం. ఈ ఘటన మరువకముందే కేటీదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామానికి చెందిన యువతి పొలం పనులకు వెళ్లే సమయంలో ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆ యువతికి ఏం చేయాలో తోచక పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు దవాఖానకు తరలించగా.. కోలుకుంటున్న సమయంలో అస్వస్థతకు గురైంది. దీంతో సదరు యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. కొన్ని రోజులుగా పొలానికి వెళ్లే సమయంలో ముగ్గురు యువకులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని, ఇది భరించలేక పురుగుల మందు తాగినట్లు తెలిపింది. అయితే, ఆ యువతి దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా.. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో యువతి మృతికి ముగ్గురు యువకులు కారకులనే వార్త చక్కర్లు కొట్టడంతో అసలు విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
దేవరకద్ర, సెప్టెంబర్ 22 : మైనర్ బాలికపై లైంగికదాడి జరిగిన ఘట న మండలంలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లగా.. తాత, అవ్వ వద్ద ఉంటూ చదువుకుంటున్నది. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో తాత, అవ్వ నిద్రిస్తుండగా.. సదరు బాలిక టీవీ చూస్తూ ఉన్నది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యువకుడు బాలిక నోట్లో గుడ్డ కుక్కి బలవంతంగా బయటకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. కుటుంబసభ్యులకు విషయం చెప్పగా ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నాగన్న తెలిపారు.