గట్టు, జనవరి 5 : మండలంలోని మాచర్ల-చింతలకుంట రహదారిలో ముసల్మాన్ ఫారెస్ట్ ప్రాంతంలో బలిగేరకు చెందిన యువకుడు తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై కేటీ మల్లేశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బలిగేరకు చెందిన సనక దేవన్న తన భార్య మరియమ్మకు ఆరోగ్యం బాగులేకపోవడంతో కర్ణాటకలోని రాయచూర్‌లో ఆదివారం ఆమెకు వైద్యం చేయించుకుని బస్సులో బలిగేరకు తిరుగు పయనమయ్యాడు. ఈ సమయంలో కుమారుడు తిమ్మప్పకు ఫోన్ చేసి తాము బలిగేరకు వస్తున్నామని, బస్టాండుకు రమ్మని కోరారు. అయితే తాను చింతలకుంట నుంచి బయలుదేరుతున్నానని తిమ్మప్ప వారికి సమాధానమిచ్చా డు.
అయితే తల్లిదండ్రులు బలిగేరకు వచ్చి తిమ్మప్పకు మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చిందన్నా రు. అయితే రాత్రి వరకు తమ కుమారుడు ఇంటికి వస్తాడనుకుని ఊరకుండిపోయారు. కాగా ఉదయం వరకు తిమ్మప్ప ఇంటికి రాకపోవడంతో దేవన్న తన అన్న కుమారుడు ఏసును వెంటపెట్టుకొని సోమవారం ఉదయం మాచర్ల-చింతలకుంట మార్గంలోని ముసల్మాన్ ఫారెస్ట్ ప్రాంతంలో గాలిం పు చేపట్టారు. అయితే ఓ ప్రాంతంలో ఓ యువకుడి తలపై బలమైన గాయమై పడి ఉండడాన్ని వారు గుర్తించారు. అప్పటికే మృతిచెందిన యువకుడు తమ కుమారుడని తండ్రి దేవన్న తేల్చాడు. కాగా తమ కుమారుడు మృతి వెనుక మిట్టదొడ్డికి చెందిన అబ్రహం హస్తముందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలాన్ని సీఐ టంగుటూరి శ్రీను సందర్శించి వివరాలు సేకరించారు. డాగ్ స్వాడ్‌ను కూడా సంఘటనా స్థలానికి రప్పించారు. కాగా ఈ హత్య సంచలనంగా మారింది.
మాచర్ల-చింతలకుంట రహదారిలో ముసల్మాన్దొడ్డి ఫారెస్ట్ ప్రాంతంలో హత్యకు గురైన తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా బలిగేరకు చెందిన దంపతులు మరియమ్మ, సనక దేవన్నలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా ఇద్దరు కుమారులు తాపీ మేస్త్రీలు. కాగా పెద్ద కుమారుడైన ఏబేల్ మూడు, నాలుగు నెలల కిందట ఓ ఇంటి నిర్మాణాన్ని చేపట్టే సమయంలో గోడకూలి మృతి చెందాడు. అయితే తిమ్మప్ప మృతితో అతడి సోదరుడు ఏబేల్ మృతిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరి మృతికి ఓ వివాహతేర సంబంధం కారణమని చెబుతున్నారు. ఈ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో హత్యకు గల కారణాలు బయటపడవచ్చని తెలుస్తోంది. కాగా తిమ్మప్పను అడ్డు తొలగించుకుంటే అక్రమం సక్రమం అవుతుందనే ఆలోచనతో హత్య చేయించినట్లు సమాచారం. కాగా అనుమానం రాకుండా తిమ్మప్ప మిత్రుల్లో ఒకరి చేత ఈ హత్య చేయించినట్లు చెబుతున్నారు.