అమ్రాబాద్, ఆగస్టు 9 : ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ చెప్పారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండలంలోని మన్ననూర్ గిరిజన భవనంలో ఐటీడీఏ పీవో రోహిత్‌గోపిడి ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు మన్ననూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చెంచులు డప్పులు, నృత్యాలతో గిరిజన భవనం వరకు ర్యాలీ చేపట్టారు. చెంచులక్ష్మి, కొమురంభీం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చెంచులు ఆర్థికంగా ఎదగడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
ఆదివాసీ గిరిజనులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని కలెక్టర్ సూచించారు. చెంచు సంఘాలు సమిష్టిగా ఉంటూ సమస్యలను ఐటీడీఏ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. చెంచుగూడాల్లో రోడ్లు నిర్మించి విద్య, వైద్యం మెరుగైన వసతులు కల్పించేలా పాటుపడుతానని తెలిపారు.
రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. అనంతరం వేషధారణతో జీవిత వృత్తాంతాన్ని నృత్యాలతో చెంచులు ప్రదర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ ప్రతిభ కనబర్చిన గిరిజన, చెంచు ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి ఫిరంగి, ఆర్డీవో మాధవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో తారాసింగ్, శిశుసంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో మోహన్‌లాల్, చెంచు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నాగయ్య, నాయకులు శ్రీనివాసులు, రాజేంద్రప్రసాద్, పెద్దిరాజు, శంకరయ్య, అమ్రాబాద్, పదర ఉమ్మడి మండలాల చెంచులు పాల్గొన్నారు.