బిజినపల్లి : పంచాయతీ కార్యదర్శులకు ( Panchayat secretaries ) పని భారాన్ని తగ్గించాలని ఆ సంఘం నాయకులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పంచాయతీ సెక్రెటరీ సోనాలి, ఇతర కారణాల వల్ల మృతి చెందిన పంచాయతీ కార్యదర్శుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిర్వహణ కోసం ప్రతినెల నిధులు విడుదల చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు జారీచేసిన షోకాజ్ నోటీసులు, మెమోలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులకు సీనియార్టి ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని, పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో ప్రజలు, కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో భూపతి, సురేష్, రమేష్, లింగారెడ్డి తదితరులున్నారు.