మరికల్ : మహబూబ్నగర్( Mahabubnagar) జిల్లా మరికల్ మండల పరిధిలోని గాజులయ్య తండాకు చెందిన దేగవత్ లక్ష్మి కోయిల అనే మహిళ పాముకాటుతో ( Snakebite ) మృతి చెందింది. గ్రామస్థుల కథనం మేరకు లక్ష్మి కోయిల వంటకు అవసరమయ్యే కట్టెలు కోసం శుక్రవారం సాయంత్రం చెట్ల పొదల వద్దకు వెళ్లింది. ఈ సమయంలో పాము కాటు వేయడంతో గుర్తించిన ఆమె గ్రామస్థులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతి చెందిందని తెలిపారు.
తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. అంత్యక్రియలకు సైతం డబ్బు లేకపోవడంతో గ్రామస్థులంతా కలిసి శనివారం అంతక్రియలు జరిపేందుకు సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ (PRTU) మండల అధ్యక్షుడు, తండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నవీన్ కుమార్ గౌడ్ రూ. 5వేలు , మరికల్ మాజీ సర్పంచ్ గోవర్ధన్ వెయ్యి రూపాయలు అందజేసినట్లు మాజీ సర్పంచ్ భాస్కర్ నాయక్ తెలిపారు. అనాధలైన పిల్లలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.