ఖమ్మం, జనవరి 11: సంక్రాంతి సంబురాలు జరుపుకునేందుకు ప్రజలు పల్లెబాట పట్టారు. నగరాలు, పట్టణాల నుంచి భారీసంఖ్యలో సొంత గ్రామాలకు తరలివస్తున్నారు. పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. మరోవైపు వరుసగా రెండు రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. సంక్రాంతి తెలుగు ప్రజలు చేసుకునే అతిపెద్ద పండుగ. ఈ పండుగకు పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు గ్రామాలకు తరలివెళ్తుంటారు. ముఖ్యంగా ఆర్టీసీ, రైల్వేల ద్వారా ప్రజలు ప్రయాణం చేస్తారు.
రెండ్రోజులుగా ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాదు నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత వైఖరి వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆంధ్రాకు వెళ్లడానికి ప్రధాన రహదారికావడంతో ఖమ్మం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి. ఖమ్మం బస్టాండ్కి బాగా రద్దీ పెరిగింది.
సత్తుపల్లి వెళ్లడానికి రెండుగంటల నుంచి ఎదురుచూస్తున్నాను. మూడు బస్సులు వచ్చాయి.. కానీ కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. పండుగలు వచ్చినప్పుడైనా బస్సు సర్వీస్లను పెంచాలి. హైదరాబాద్ వెళ్లే బస్సులు పదిదాక వచ్చాయి.. కానీ సత్తుపల్లి వెళ్లడానికి మాత్రం రాలేదు.
– ఎన్.నిషిత, సత్తుపల్లి
అశ్వారావుపేటకు బస్సు ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. ఆర్టీసీ అధికారులను అడిగితే వస్తుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారే తప్ప ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పడం లేదు. పండుగల సమయంలో బస్సుల సంఖ్యను పెంచితే ఇంత ఇబ్బంది ఉండదు.
– డి.తేజశ్వని, అశ్వారావుపేట